ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం ద్వారా వైకాపా కోరుకుంటున్న మార్పుల జాబితా ఇంకా పూర్తయినట్టు లేదు. ఎన్నికల సందర్భంగా పలువురు ఉన్నతాధికారుల బదిలీలు కోరారు. ఎస్పీల బదిలీలు కోరారు. వారు కోరినట్టుగానే అన్నీ జరిగాయి. ఈసీకి ఫిర్యాదు ఇవ్వడం, వారు చర్యలు తీసుకోకముందే… ఇదిగో ఫలానా అధికారి బదిలీ రేపు అని వైకాపా నేతలు చెప్పడం, మర్నాడు అదే జరగడం. ఇదేగా జరిగింది. ఇప్పుడు ఈవీఎంల భద్రత విషయమై కూడా ఎన్నికల సంఘానికి సూచనలు సలహాలు చేశారు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి.
ఎన్నికల సంఘానికి ఆయన రాసిన లేఖలో… అత్యంత స్వేచ్ఛాయుత వాతావరణంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్ని రాష్ట్రంలో నిర్వహించినందుకు వైకాపా తరఫున ధన్యవాదానాలు తెలిపారు. ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూముల్లో ఉన్నాయనీ, వాటి భద్రతపై జాగ్రత్త వహించాలని విజయసాయి సూచించారు. ఎందుకంటే, ఎన్నికల సంఘం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు విమర్శలు చేస్తున్నారనీ, కాబట్టి రాష్ట్ర పోలీసు బలగాల భద్రత కంటే… స్ట్రాంగు రూముల వద్ద కేంద్ర బలగాలనే భద్రతకు దింపాలని కోరారు. సి.ఐ.ఎస్.ఎఫ్., సి.ఆర్.ఫి.ఎఫ్. బలగాల సంఖ్యను పెంచాలన్నారు. స్ట్రాంగ్ రూముల దగ్గర 24 గంటల సీసీ కెమెరాల నిఘా పెట్టాలన్నారు. ఎందుకంటే, ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించని అధికార పార్టీ వర్గాల నుంచిగానీ, ఇతర విచ్ఛిన్నకర శక్తుల నుంచిగానీ ఈవీఎంలను కాపాడాలట. ఈవీఎంలను భద్రంగా చూసుకోవాలని ఎన్నికల సంఘాన్ని విజయసాయి లేఖలో కోరారు.
ఈవీఎంల భద్రత ఎలాగో ఎన్నికల సంఘానికి విజయసాయి చెప్పాలా..? అది వారికి తెలీదా… బాధ్యత కదా? అయినా, ఇక్కడ కూడా ఏపీ పోలీసులపై నమ్మకం లేదనీ, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నమ్మకం లేదని ఇంకా విమర్శలు చేస్తుండటం దిగజారుడు తనానికి పరాకాష్ట. ఎన్నికల సందర్భంగా అధికారుల బదిలీలు, పెద్ద ఎత్తున ఈవీఎంల మొరాయింపులు, అర్ధరాత్రి వరకూ ఎన్నికల నిర్వహణ… ఇవేవీ ఈసీ వైఫల్యాలుగా వారికి కనిపించడం లేదా..? ఇదంతా అత్యంత స్వేచ్ఛాయుత వాతావరణంగా కనిపిస్తోందా..? అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య సహనంతో ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పరుగానీ… ఆ పరిస్థితికి కారణమైనవారిని భుజాన మోస్తారు. ఎన్నికల నిర్వహణ తీరుపై ముఖ్యమంత్రి ఓపక్క ఫిర్యాదు చేస్తే… ఇదే రోజున ఈసీ పనితీరు అద్భుత: అని వైకాపా ఎంపీ లేఖ రాయడాన్ని ఎలా చూడాలి? మీరొకటి చేస్తే.. దానికి కౌంటర్ గా మేమూ ఒకటి చేస్తామనే ధోరణే దీన్లో కనిపిస్తోంది. ఈ లేఖ వల్ల ఏం ఉపయోగం..? ఈసీకి తెలీదా… బలగాల భద్రత మధ్య ఈవీఎంలు ఉండాలనీ, సీసీ టీవీ కెమెరాల నిఘా ఉండాలనీ?