ముంచుకొస్తున్న మున్సిపల్ ఎన్నికలు.. మరో వైపు రాజుకుంటున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమంతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొనేందుకు గతంలోనే సీఎం జగన్ షెడ్యూల్ ఖరారయింది. అది… స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం నిర్ణయం బయటకు రాక ముందే జరిగింది. ఇప్పుడు విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యమ పరిస్థితుల్లో ఆయన విశాఖ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. టూర్ క్యాన్సిల్ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. వెళ్లి స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోకుండా వస్తే.. తీవ్రమైన విమర్శలు వస్తాయి. ఈ కారణంగా… స్టీల్ ప్లాంట్ జేఏసీ అనే ఒక బృందాన్ని సృష్టించి.. ఆ బృందంతో జగన్ సమావేశం అవుతారని వైసీపీ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. ఈ జేఏసీలో ఎవరెవరు ఉంటారో క్లారిటీ లేదు.
మరో వైపు విశాఖ కార్పొరేషన్ ను గెల్చుకోకపోతే.. తమ రాజధాని ఆకాంక్షలకు దెబ్బ పడుతుందన్న భయంతో ఉన్న విజయసాయిరెడ్డి విశాఖలోనే మకాం వేసి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ గురించి చెప్పకుండా… మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలంటూ ప్రజల ముందుకు వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ఎన్నికల ప్రచార యాత్రకు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ యాత్రలుగా మార్చుకుని పాదయాత్రలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 20న ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తారు. గాంధీ విగ్రహం నుంచి కూర్మన్నపాలెం వరకు పాదయాత్ర ఉంటుందన్నారు. ప్రైవేటీకరణను పార్లమెంట్ బయట, లోపల వ్యతిరేకిస్తున్నామని.. అసెంబ్లీలో తీర్మానం విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ చూసుకుంటారని చెప్పుకొచ్చారు.
ఓ వైపు పోస్కోతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని..ఒప్పందం కూడా పూర్తయిందన్న విషయం పార్లమెంట్లో కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ వ్యవహారం మొత్తం సీఎం జగన్‌కు కూడా తెలుసని కేంద్రం లిఖితపూర్వకంగా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ వాసులు.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను నిమ్మించడానికి వైసీపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ పార్టీల ఎంపీలతో ప్రధానిని కలుస్తామని… చంద్రబాబు డ్రామాలను నమ్మవద్దని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు.. వైసీపీ నేతలకు స్టీల్ ప్లాంట్ ఇష్యూ పెద్ద చిక్కును తెచ్చి పెట్టింది.