విమర్శలు చేయడమే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విద్యుక్తధర్మం, విహిత కర్తవ్యం, దినచర్య! సందర్భం ఏదైనా అనవసరం, దాన్ని టీడీపీ మీదకి ఎక్కుపెట్టి వదల్డమే ఆయన పని. ఇప్పుడు ఫొని తుఫాను అడ్డం పెట్టుకుని వరుసగా ట్వీట్ల మీద ట్వీట్లు గుమ్మరిస్తున్నారు విజయసాయి రెడ్డి. ఎలాంటి ప్రాణ నష్టం జరక్కుండా సహాయక చర్యలు చేపట్టిన అధికారులను అభినందిస్తూనే…. ప్రచార హడావుడి లేకుండా అవిశ్రాంతంగా మూడురోజులు కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. అంటే, విపత్తు సమయాల్లో ప్రచార ఆర్భాటం కోసం అధికారులు చూస్తారా..? గతంలో వారు చేపట్టిన సహాయక చర్యల్లో ప్రచార కోణం ఉందా..? వారి పనితీరుపై సెటైర్ వెయ్యడమే కదా ఈ వ్యాఖ్యల ఉద్దేశం..!
మరో ట్వీట్ లో ముఖ్యమంత్రి ఎలా నడుచుకోవాలో సలహా ఇచ్చారు! ఫొనీ తరువాత కలెక్టర్ల నిబంధనల ప్రకారం చంద్రబాబు నడుచుకోవాలనీ, తుఫాను వచ్చినప్పుడల్లా పచ్చ చొక్కాలకు కోట్లకు కోట్లు నామినేషన్ పద్ధతిలో పనులను పంచిపెట్టేవారనీ ఆరోపించారు. అంటే, గతంలో వచ్చిన తుఫాన్ల సందర్భంలో జరిగిన సహాయ చర్యలన్నీ టీడీపీ నేతల జేబులు నింపిన కార్యక్రమాలేనా..? అంతటి తీవ్ర ఆరోపణ చేసేముందు కనీసం కొన్ని ఆధారాలైనా ఆ ట్వీట్ కి జత చేస్తే కొంతైనా అర్థవంతంగా ఉంటుంది కదా! ఇంకో ట్వీట్ లో…. పోనీ సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రమేయం లేకుండా జరిగిపోతున్నాయనీ, అందుకే ఎల్లో మీడియా ఆందోళన చెందుతోందన్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై బురద చల్లేందుకు వీలుగా… కొన్ని జిల్లాల్లో ఆహారం అందడం లేదనీ, సహాయక చర్యలు బాలేవని ప్రచారం చేస్తోందని విమర్శించారు. మీడియా గొట్టాల ముందు టీడీపీ కార్యకర్తలను పెట్టి విమర్శలు చేయిస్తున్నారని ట్వీట్ చేశారు.
ఒక ప్రకృతి వైపరీత్యం చోటు చేసుకున్న నేపథ్యంలో… బాధ్యతగల ఒక ప్రజా ప్రతినిధి చేసిన ట్వీట్లు ఇవి! వీటిల్లో ఫక్తు రాజకీయ బుద్ధే తప్ప… జరిగిన నష్టం గురించిగానీ, ప్రజలు పడ్డ కష్టం గురించిగానీ ఎక్కడైనా ఒక్క వాక్యమైనా ఉందా..? ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే దాదాపు రూ. 38 కోట్ల విలువైన పంటలకు నష్టం జరిగిందని అంచనా. బలమైన గాలులకు గ్రామాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వీటిపై సాటి మనిషి ఉండాల్సిన సానుభూతి విజయసాయి ట్వీట్లలో ఎక్కడైనా కనిపిస్తోందా..? తుఫాను సహాయ చర్యలు ఇంత పక్కాగా సరైన సమయంలో అధికారులు చేయగలుగుతున్నారంటే… అది ముఖ్యమంత్రి చంద్రబాబు తయారు చేసిన వ్యవస్థ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయంలో పక్క రాష్ట్రాలూ కూడా ఏపీని అభినందిస్తున్నాయి. ఇవేవీ వైకాపాకి అక్కర్లేదు, రాజకీయ విమర్శలు, ఆరోపణలు, శాపనార్థాలు… ఇంతేనా?