ఎస్ఈసీగా ఉన్న సమయంలో రమేష్ కుమార్ ..కేంద్ర హోంశాఖరు రాసిన లేఖ విషయంలో విజయసాయిరెడ్డికి ఇంకా అనుమానాలు మిగిలి ఉన్నాయి. అసలు ఆ లేఖ ఎక్కడి నుంచి వెళ్లింది… ఆ లేఖపై విచారణ జరిపించాలంటూ.. డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఫోర్జరీ సంతకాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా చేసిన సంతకానికి.. హోంశాఖకు రాసిన లేఖలో సంతకానికి మధ్య తేడా ఉందని గుర్తించినట్లుగా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. లేఖను కనకమేడల, వర్ల రామయ్య, టీడీ జనార్ధన్ సృష్టించారని.. లేఖలో ఆరోపించారు.
ఈ తతంగమంతా ఎన్నికల మాజీ కమిషనర్ రమేష్ కుమార్‌కు తెలిసే జరిగిందని.. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాలని కోరారు. లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలి..బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని .. ఐపీ ఆధారంగా లేఖ పంపిందెవరో గుర్తించాలని లేఖలో విజయసాయిరెడ్డి డీజీపీని కోరారు. నిజానికి ఈ విషయంలో విజయసాయిరెడ్డికి ధర్డ్ పర్సన్. ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. నిజంగా..సంతకం ఫోర్జరీ అయితే.. రమష్ కుమార్ ఫిర్యాదు చేయాలి. అప్పుడే ఆ ఫిర్యాదు వ్యాలిడ్ అవుతుంది. కానీ విజయసాయిరెడ్డి మాత్రం.. తనకే మాత్రం సంబంధం లేకపోయినా… ముగ్గురు టీడీపీ నేతల్ని కలిపేసి.. రమేష్ కుమార్‌కు తెలిసే జరిగిందని ఆరోపిస్తూ.. విచారణ చేయాలని లేఖ రాశారు.
రమేష్ కుమార్ కి తెలిసే ఆ లేఖ రాస్తే.. ఇక సమస్యే లేదు. తమపై లేదా.. ప్రభుత్వంపై కుట్ర పన్నారని భావిస్తే.. ఆ మేరకు.. ఫిర్యాదు చేయాలి. కానీ విజయసాయిరెడ్డి డీజీపీకి లేఖ రాసి.. దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఎస్ఈసీ లేఖ మీడియాకు విడుదలైనప్పటి నుంచి అది ఫేక్ అని చెప్పేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. లేఖ అందిందని.. రక్షణ కల్పించామని.. హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చెప్పిన తర్వాత అది ఎలా బయటకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు.. రమేష్ కుమార్ కు తెలిసే టీడీపీ నేతలు ఆ లేఖ రాశారంటూ.. కొత్త వాదన వినిపిస్తున్నారు.