సీఐడీ విచారణకు హాజరయ్యేందుకు రెడీ అయిన విజయసాయిరెడ్డి చివరి క్షణంలో డుమ్మా కొట్టారు. తాను విచారణకు రాలేనని సమాచారం పంపారు. ఆయన తీరుతో సీఐడీ సిట్ అధికారులు షాక్ కు గురయ్యారు. ఆయనను నిందితుడిగా కాకుండా సాక్షిగానే పిలిచారు. అరెస్టు చేస్తారన్న భయం లేదు. ఆయనేమీ ఇప్పుడు తీరిక లేనంత పనుల్లో లేరు. అయినా విచారణకు హాజరు కాలేదు.
విజయసాయిరెడ్డి ఇంతకు ముందు లిక్కర్ స్కాంలో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని బహిరంగంగా ప్రకటించారు. ఆయన ఎలా కర్త, కర్మ, క్రియ అయ్యాడో విజయసాయిరెడ్డి సీఐడీ అధికారులకు వివరించాల్సి ఉంది. ఇప్పటికే చాలా లింకులు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ .. విజయసాయిరెడ్డి లాంటి పాత్రధారి చెప్పే నిజాలు మరింత బలంగా ఉంటాయి.
అయితే ఈ విచారణకు హాజరు కావొద్దని ఆయనకు ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి వచ్చినట్లుగా తెలుస్తోంది. లిక్కర్ మాఫియా వేల కోట్లు దోపిడీ చేసింది. అందులో కింగ్ పిన్ ఎవరో.. అత్యధిక వాటా ఎవరికి చేరిందో బయట పెడితే బాగోదని హెచ్చరికలు వెళ్లినట్లుగా చెబుతున్నారు. కుటుంబపరంగా కూడా ఒత్తిడి ఉండటంతో విజయసాయిరెడ్డి ఆగిపోయారు. ఇప్పుడు విజయసాయిరెడ్డిని సీఐడీ నిందితుడిగా చేర్చి.. నోటీసులు వస్తుందేమో చూడాల్సి ఉంది.