సోము వీర్రాజు కి విజయ సాయి రెడ్డి కి మధ్య జరిగిన ట్వీట్ వార్ ఇవాళ ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మాటల యుద్ధం సంగతి ఎలా ఉన్నా, వీరిద్దరు చేసిన ట్వీట్స్ లో క్యాబేజీ పూల గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో అసలు విజయ సాయి రెడ్డి తన ట్వీట్స్ లో ఎందుకని ఎప్పుడు క్యాబేజీ గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు అన్న చర్చ కూడా ఒక టీవీ ఛానల్ డిబేట్ లో జరిగింది. దానికి బిజెపి నేత సత్యమూర్తి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
ట్వీట్ వార్:
అసలు గొడవంతా ప్రారంభమైంది విజయ సాయి రెడ్డి ట్వీట్ తో. విజయ సాయి రెడ్డి ట్వీట్ చేస్తూ, “తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి…చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు.” అంటూ బీజేపీపై విమర్శలను తన ట్విట్టర్ హ్యాండిల్ లో రాసుకొచ్చారు. అయితే విజయ సాయి రెడ్డి ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు సోము వీర్రాజు. ఆయన ట్వీట్ చేస్తూ, “మా ఊసు ఎందుకులే @VSReddy_MP గారూ..!!! కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా. తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి.” అని రాసుకొచ్చారు.
విజయసాయి రెడ్డి కి క్యాబేజీ కి లింక్ పై సెటైర్:
ఒక టీవీ ఛానల్ డిబేట్ లో యాంకర్ మాట్లాడుతూ అసలు క్యాబేజీ పూల గురించి, కూర గురించి ఎందుకని ఇలా చర్చలోకి తీసుకువస్తున్నారని అడగగా, దానికి బీజేపీ నేత సత్యమూర్తి వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. 1970 లలో ఎమర్జెన్సీ సమయంలో తాను జైలు శిక్ష అనుభవించానని, జైల్లో ఉన్నప్పుడు ఎందుకో తెలియదు కానీ ఎక్కువగా క్యాబేజీ కూర వండేవారని, దాంతో జైల్లో గడిపిన వారికి క్యాబేజీ అంటేనే విసుగు వచ్చేదని, విజయ సాయి రెడ్డి గారు జైల్లో గడిపిన సమయంలో బహుశా ఆయనకు కూడా ఇదే సమస్య ఎదురయ్యే ఉండవచ్చునని, అందుకే తాను చేసే ట్వీట్స్ లో ఆయన అస్తమానం క్యాబేజీని తలుచుకుంటూ ఉంటారని బిజెపి నేత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు డిబేట్లో పాల్గొన్న యాంకర్ కు సైతం నవ్వు తెప్పించాయి. అయితే వైఎస్సార్సీపీ నేత మాత్రం బిజెపి జనసేన నేతల పై మండిపడ్డారు. జన సేన నేత సైతం విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలు, అవధానంలో ప్రశ్నలడిగే అప్రస్తుత ప్రసంగి వ్యాఖ్యల వంటివి అని తీసి పడేశారు.
టిడిపి స్పందన :
అయితే సోము వీర్రాజు వ్యాఖ్యలపై టిడిపి నేతలు మాత్రం విమర్శనాత్మకంగా స్పందించారు. టిడిపి నేత జవహర్ మాట్లాడుతూ, తెలంగాణలో పవన్ మీద లేని ప్రేమ, బిజెపి కి ఏపీలో ఎలా వచ్చిందో వివరించాలని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా, పవన్ కళ్యాణ్ ని బాగా చూసుకోవాలని మోడీ చెప్పాడని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, బాగా చూసుకోవాలని కాదు కానీ బాగా వాడుకోవాలని చెప్పి ఉండవచ్చు అని ఆయన అన్నారు. అయితే డిబేట్ నిర్వహించిన యాంకర్ సహా మరికొందరు టిడిపి అభిమానులు సైతం అసలు ఈ గొడవంతా టిడిపిని సైడ్ చేయడానికి అయి ఉండవచ్చని అంటున్నారు. మాటల యుద్ధం వైఎస్సార్సీపీ కి బిజెపి కి మధ్య కొనసాగేలా చేసి టిడిపి పోటీ లో లేదు అన్న అభిప్రాయం కలిగించడానికి ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని వారు అభిప్రాయ పడుతున్నారు.
ఏది ఏమైనా ప్రస్తుతం సోము వీర్రాజు విజయసాయిరెడ్డి ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది.