ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన బీజేపీ అధికారంలో ఉంటే పదేళ్లుగా విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పై చెలరేగిపోయారు విజయసాయిరెడ్డి. షర్మిల ప్రత్యేకహోదా పేరుతో రాజకీయాలు చేస్తోందని ఆయనకు కోపం వచ్చింది. ఎవరు ప్రశ్నిస్తే వారి వల్లే ప్రత్యేకహోదా రాలేదని అనడం వైసీపీ స్టైల్. బురద చల్లేసి రాజకీయం చేయడం వైసీపీ స్టైల్. ఇప్పుడు ఆయన అదే చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ ను విమర్శిస్తూ బీజేపీకి గిలిగింతలు పెడుతూ.. ఆయన చేసిన ప్రసంగం చూసి తోటి సభ్యలు కూడా ఎంత కష్టం అని చిరునవ్వులు చిందించారు. రాజ్యసభలో రాష్ట్ర పతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది.
ఇందులో మాట్లాడే అవకాశం విజయసాయిరెడ్డికి వచ్చింది. ఆయన తన ప్రసంగం మొత్తం కాంగ్రెస్ ను విమర్శించడానికి వాడుకున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ వస్తుందని.. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ పడిపోతుందని జోస్యం చెప్పి బీజేపీ నేతలకు గిలిగింతలు పెట్టారు. చట్టంలో పెట్టకపోవడం వల్లే ప్రత్యేకహోదా రాలేదన్నారు కానీ.. ఇస్తామన్న బీజేపీ ఇవ్వకపోవడంపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ లో షర్మిల చేరడాన్ని కుటుంబంలో చిచ్చుపెట్టడంగా చెప్పుకున్న ఆయన.. మరి కాంగ్రెస్ కు ఆ ఫ్యామిలీ చేసిన ద్రోహం గురించి చెప్పలేకపోయారు.
విజయసాయిరెడ్డి ఎక్కడ టీడీపీ, జనసేన కూటమిలో చేరుతుందోనన్న భయంతో.. తాము కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లలేదని నిరూపించడానికి అన్నట్లుగా విజయసాయిరెడ్డి చెలరేగిపోయినట్లుగా కనిపిస్తోంది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి జిమ్మిక్కులు ఎంత వరకూ పనికి వస్తాయో కానీ.. పదేళ్లుగా అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీని నిందించి.. బీజేపీని పల్లెత్తు మాట అనలేని.. ప్రతిపక్ష పార్టీలోని నేతగా విజయసాయిరెడ్డి వ్యవహారం మాత్రం.. అందర్నీ ఆశ్చర్యపరిచింది.