వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత ప్రైవేటు బిల్లులు ప్రవేశ పెడుతూ తన హక్కులను గరిష్టంగా వాడుకుంటున్నారు. అయితే ఆయన రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కోసం.. లేదా విభజన హామీల అమలు కోసం ప్రైవేటు బిల్లులు పెట్టడం లేదు. పబ్లిసిటీకి పనికి వచ్చే అంశాలపై ప్రైవేటు బిల్లులు పెడుతున్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న “అమ్మఒడి” పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని విజయసాయిరెడ్డి ఏకంగా ప్రైవేటు బిల్లు పెట్టేశారు. బాలల ఉచిత నిర్భంధ విద్యా హక్కు(సవరణ)-2020 పేరుతో ఈ బిల్లు రాజ్యసభకు సమర్పించారు.
ఏపీ ప్రభుత్వమే ఈ ఏడాది అమ్మఒడి ఇవ్వలేక.. జనవరి నుంచి జూన్‌కు వాయిదా వేసినట్లుగా ప్రకటించింది. దీనికి హాజరు అనే కారణం చెప్పి బండి లాగిస్తున్నారు. ఇప్పుడు ఈ గంటను కేంద్రం మెడకు చుట్టేందుకు రెడీ అయ్యారు. ఈ ఒక్క బిల్లుతోనే విజయసాయిరెడ్డి ఆగిపోలేదు పట్టభద్రులందరికీ నిరుద్యోగ భృతి పొందే హక్కును కల్పించేలా రాజ్యాంగ సవరణ బిల్లు, ప్రార్థనా మందిరాలపై దాడిచేసే నిందితులకు విధించే గరిష్ఠ జైలు శిక్షను రెండేళ్ల నుంచి 20ఏళ్లకు పెంచేలా ఐపీసీ(సవరణ)-2021 పేరుతో బిల్లులు కూడా ప్రవేశపెట్టారు. విజయసాయిరెడ్డి ప్రవేశ పెట్టిన బిల్లులు కనీసం చర్చకు కూడా వచ్చే అవకాశం లేదు కానీ.. పబ్లిసిటీ మాత్రం పీక్స్‌లో చేసుకోవచ్చు.
విజయసాయిరెడ్డి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఉన్న కార్పొరేట్ కంపెనీల నిధులను సీఎంఆర్ఎఫ్కు ఎందుకివ్వకూడదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ కార్పొరేట్ కంపెనీలు సామాజిక సేవల కింద ఖర్చు చేయకుండా ఉన్న వాటిని పీఎం కేర్స్‌కు ఇస్తున్నారు. కానీ సీఎం కేర్స్‌కు కూడా ఇచ్చేలా చూడాలంటున్నారు. నిజానికి రాష్ట్రాల్లో సీఎం కేర్స్ లేదు. ఉన్నదంతా సీఎంఆర్ఎఫ్ మాత్రమే. పీఎంఆర్ఎఫ్ ను నిర్వీర్యం చేసి ప్రైవేటువ్యవహారంలా పీఎం కేర్స్ తెచ్చినప్పుడు… రాష్ట్రాల్లో కూడా సీఎం కేర్స్ ఎందుకు తేకూడదన్న ప్లాన్‌తోనే విజయసాయిరెడ్డి ఇలా మాట్లాడినట్లుగా కొంత మంది అంచనా వేస్తున్నారు.