విజయసాయిరెడ్డి జగన్ కోటరి గురించి చెప్పిన తర్వాత రాజకీయవర్గాలు పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే జగన్ ఓ వలయం ఏర్పాటు చేసుకుని అందులోనే ఉండిపోయారు. ఆ వలయం ఆయనను రోజు రోజుకు పాతాళంలోకి తీసుకెళ్తోంది. బయట ఏం జరుగుతుందో కళ్ల ముందు కనిపించినా సరే ఆయన ఆ వలయంలో ఉన్న వ్యక్తులు చెప్పేదే నమ్ముతారు.. అదే మీడియా ముందు చెబుతారు. నవ్వుల పాలవుతారు. అంతగా ఆయనను ఊబిలో దింపిన కోటరీలో ఎవరెవరు ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
నిజానికి విజయసాయిరెడ్డి కోటరీ అనే పేరు వినిపిస్తే మొదటగా వచ్చే పేరు విజయసాయిరెడ్డిదే. కాకపోతే అది 2019 ఎన్నికల ఫలితాల వరకే. గెలుపులో ఆయన పాత్ర కీలకం. కానీ ఆయన ఉత్తరాంధ్రపై ఆశపడి అటు వైపు వెళ్లడంతో ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని కోటరీని మార్చేసుకున్నారు. విజయసాయిరెడ్డిని మెల్లగా దూరం చేశారు. అసలు కోటరీకి హెడ్ గా మారారు. అయితే ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డేనా ఇంకా ఉన్నారా అన్నది మాత్రం వైసీపీలో అత్యంత సీనియర్ నేతలకే తెలుసు.
జగన్మోహన్ రెడ్డి ఎవర్నీ నమ్మరు. ఆయన నమ్మే వ్యక్తులు.. ఇద్దరు ముగ్గురు ఉంటారు. వారిలో ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకే గెలిపించిన విజయసాయిరెడ్డిని దూరం చేసుకుని తనను..తన పార్టీని పాతాళానికి పడిపోయేలా చేసిన సజ్జలను ఇంకా పక్కన పెట్టుకుని బండి నడిపిస్తున్నారు. ఇప్పటికీ పార్టీ కోలుకునే సూచనలు ఏమీ కనిపించకుండా చేయడంలో ఆయన విజయవంతం అవుతున్నారు. అయితే ఆయన ఒక్కరే కాదని.. ఆ కోటరీలో జగన్మోహన్ రెడ్డి సతీమణి కూడా ఉంటారని అంటున్నారు. నిజానికి జగన్ సతీమణి భారతి రెడ్డి.. విజయసాయిరెడ్డికి రెండో సారి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించారని వైసీపీలో అందరికీ తెలుసు. మరి ఆ కోటరీపై విజయసాయిరెడ్డికి ఎందుకు కోపం వచ్చింది ?
వైసీపీలో జరిగిన పరిణామాల్ని చూస్తే విజయసాయిరెడ్డిని ప్లాన్డ్ గా జగన్ కు దూరం చేశారని అర్థం చేసుకోవచ్చు. ఆయన అడ్డం తిరిగితే ఎంత రిస్కో తెలిసి కూడా ఎందుకు ఈ పని చేశారో.. ఇప్పుడు ఉన్న కోటరీ పెద్దలకే తెలియాలి. ఈ వ్యవహార ముందుముందు చాలా పెద్ద రచ్చకు కారణం అయ్యే అవకాశం ఉంది.