ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై బరి తెగించి పోరాడాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిర్ణయించుకున్నారు. గత రెండేళ్లుగా వైసీపీ ఎంపీ తెగించి పోరాడుతున్నట్లుగా కాకుండా.. ఈ సారి బరి దాటి మరీ.. తెగించి పోరాడాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇందు కోసం పార్లమెంట్లో విభజన చట్టంలో సవరణల కోసం పట్టుబట్టాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవడంతో లోక్సభలో అతి పెద్ద పార్టీల్లో ఒకటిగా ఉన్న వైసీపీ అజెండా ఏమిటన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. దీంతో విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి.. తమ ప్రత్యేకహోదా పోరాట ఎజెండాను ప్రకటించారు. ఒక్క ప్రత్యేక హోదా విషయంలోనే కాకుండా.. పోలవరం విషయంలోనూ సవరణలు ప్రతిపాదించడానికి విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు.
ప్రత్యేకహోదా విషయంలో గతంలోనే తాము అలుపెరుగని పోరాటం చేశామని.. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రత్యేకంగా ప్రైవేటు బిల్లు పెట్టారని గుర్తు చేశారు. అప్పట్లో ఆర్థిక బిల్లు అన్న కారణంగా బీజేపీ పక్కన పెట్టిందని ఆ తర్వాత వైసీపీ తరపున కూడా ఓ బిల్లులును పెట్టామని గుర్తు చేశారు. అయితే అప్పట్లో కేంద్రంపై వైసీపీ విమర్శలు చేసింది. ఇప్పుడు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. దీంతో ప్రత్యేకహోదా తీసుకు వస్తారని ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ రెండేళ్ల కాలంలో ఎలాంటి పోరాటాలు చేయలేదు. సీఎం జగన్.. పోరాటాలు చేయలేమని.. ప్లీజ్ ..ప్లీజ్ అని అుడుగుతామని.. వచ్చినప్పుడు వస్తుందని చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పుడు ఆ పరిస్థితి అయిపోయిందని.. పోరాటమేనన్నట్లుగా విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు. ఏకంగా చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తామని చెబతున్నారు. లోక్సభలో వైసీపీకి ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు. వారితో చట్టాలకు సవరణలు ప్రతిపాదించవచ్చు. బీజేపీ మద్దతి ఇస్తే ప్రత్యేకహోదా వచ్చేస్తుంది. ఈ విషయంలో విజయసాయిరెడ్డి కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయన తన పోరాటంతో ప్రత్యేకహోదా తీసుకు వస్తే… ఏపీకి గొప్ప విజయం లభించినట్లుగానే భావించాలి.