రాజకీయ సన్యాసం తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్న విజయసాయిరెడ్డి పగతో రగిలిపోతున్నారు. తనకు ఈ దుస్థితి పట్టించింది జగన్ రెడ్డి కోటరీ అని వారి సంగతి తేల్చాలనుకుంటున్నారు. ఇటీవల బహిరంగంగా జగన్ కోటరీపై మాట్లాడిన ఆయన తాజాగా.. మరో ట్వీట్ చేశారు. కోటరీని వదిలించుకోకపోతే.. కోట కూడా మిగలదని హెచ్చరికలు పంపారు. బయట పార్టీ పరిస్థితిని స్వయంగా తెలుసుకోవాలని కూడా జగన్ కు తన ట్వీట్లో సలహాలతో కూడిన సంకేతాలు పంపారు.
విజయసాయిరెడ్డి జగన్ను ఏమీ అనడం లేదు. కానీ ఆయన చుట్టూ ఉన్న వారిని టార్గెట్ చేస్తున్నారు. వారిని జగన్ కు దూరం చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అనుకోవచ్చు. గతంలో విజయసాయిరెడ్డి కూడా జగన్ కోటరీలోని వ్యక్తే. కానీ ఆయన స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి, మిధున్ రెడ్డి జగన్ కోటరీలో కీలక వ్యక్తులుగా చెబుతున్నారు. వీరిని ముందు దూరం పెట్టాలని విజయసాయిరెడ్డి సలహాలిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి వారిని వదిలించుకునే అవకాశం లేదు. ఎందుకంటే.. జగన్ గుట్టు అంతా వారి గుప్పిట్లో ఉంటుంది. ఏమైనా తేడా వస్తే విజయసాయిరెడ్డి కన్నా ఎక్కువగా జగన్ ను బ్లాక్ మెయిల్ చేయగలరు. ఇప్పుడు కోటరీపై కోపంతో విజయసాయిరెడ్డి చాలా విషయాలు బయట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఆయన మెల్లగా వాయిస్ రైజ్ చేస్తున్నారని అంటున్నారు.