తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కాదని ఈసీ చెప్పిందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇంత సంప్రదాయంగాచెప్పడం ఆయనకు అలవాటు లేదు కాబట్టి ఆయన తరహా లాంగ్వేజ్‌లో చెప్పారు . అయితే టీడీపీ జాతీయ పార్టీ కాదని అందరికీ తెలుసు. ఆ పార్టీలో హోదాలు జాతీయ అధ్యక్షుడు.. రాష్ట్ర అధ్యక్షుడు అని పెట్టుకున్నంత మాత్రాన జాతీయ హోదా రాదు. ఈసీ లెక్క ప్రకారం ఓట్లు, సీట్లు సాధిస్తేనే వస్తుంది. అందులో సందేహం లేదు.
అయితే టీడీపీకి జాతీయహోదా రాలేదని ట్వీట్లో సంబరపడుతున్న విజయసాయిరెడ్డి ప్రస్తుతానికి వైసీపీ జాతీయకార్యదర్శి. వైసీపీకి కూడా జాతీయ పార్టీ గుర్తింపు లేదు. అయినాసరే తాను జాతీయ ప్రధాన కార్యదర్శిగా వైసీపీ తరపున ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మరి టీడీపీపై ఆయన చేస్తున్న విమర్శలన్నీ ఆయనకు .. వైసీపీకి సరిపోతాయి కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒకరిని అనే ముందు మన గురించి కూడా కాస్త తెలుసుకోవాలని అంటున్నారు.
విజయసాయిరెడ్డి తమ అనుబంధ పత్రిక సాక్షి న్యూస్ ఆర్టికల్‌ను తన ట్వీట్లో పెట్టలేదు. ఈనాడును పెట్టారు. అందులో స్పష్టంగా టీడీపీతో పాటు వైసీపీకి కూడా జాతీయ పార్టీ గుర్తింపులేదని ఈసీ చెప్పింది. అదికూడా ప్రముఖంగా కనపిస్తోంది. అయినా తమకు లేని గుర్తింపు.. తమకు ఉందని చెలామణి అవుతూ.. ఇతరులకు అది రాలేదని ఎగతాళి చేయడం వైసీపీ ఎంపీని నవ్వుల పాలు చేస్తోంది. అయితే ఆయన ఇలాంటివి పట్టించుకోరు. తుడుచుకుని వెళ్లిపోతూంటారు.