తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 71 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 72వ ఏట అడుగు పెట్టారు. ఆయనంటే అభిమానం ఉండి.. చెప్పాలి అనుకున్న వాళ్లు చెప్పారు. టీడీపీ క్యాడర్ కేకులు కట్ చేసుకుంది. తమ అధినేతకు.. సోషల్ మీడియా ద్వారానో.. మీడియా ద్వారానో శుభాకాంక్షలు చెప్పారు తెలుగు తమ్ముళ్లు. ఇక టీడీపీ సోషల్ మీడియా… చంద్రబాబు పుట్టినరోజును హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ చేసుకుంది. అది వారి అభిమానం. ప్రతిపక్ష నేతకు ముఖ్యమంత్రి జగన్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒకే ఒక్కరు మాత్రం.. చంద్రబాబు పుట్టిన రోజును కూడా కించ పరుస్తూ.. దారుణమైన భాషతో ట్వీట్లు చేశారు. ఆ ఒక్కరే చదువుగొప్ప విజయసాయిరెడ్డి.
పెద్ద చదువులు చదువుకుని.. టక్ జగదీష్ టైప్‌లో చదువుకున్నవాళ్లకు మంచి సంస్కారం ఉంటుందన్నట్లుగా రూపురేఖల్లో కనిపించే ఆయన.. మాటల్లో మాత్రం.. కనీసం సంస్కారం కూడా మర్చిపోయారు. ఏప్రిల్ నెల ఇరవయ్యో తేదీన చంద్రబాబు పుట్టారని.. 420 అంటూ.. చంద్రబాబుపై తిట్లు లంకించుకున్నారు. ఆయన చేతిలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కూడా… టీడీపీ సోషల్ మీడియాతో పోటీ పడి.. చంద్రబాబును 420 అంటూ ట్వీట్లను ట్రెండ్ చేసేందుకు కష్టపడింది. అది సోషల్ మీడియా యుద్ధం అనుకుందాం.. కానీ గౌరవనీయ పదవిలో ఉన్న విజయసాయిరెడ్డికి.. ఇంత అగౌరవంగా ఎందుకు స్పందించాల్సి వస్తోందనేది చాలా మందికి అర్థం కాని విషయం. 420 అని పదాన్ని వినియోగించాల్సి వస్తే రాజకీయ నేతల్లో మొదటగా…విజయసాయిరెడ్డి.. ఆ తర్వాత జగన్ పేరునుప్రస్తావిస్తారు.
ఎందుకంటే వీరిపై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో ప్రతీ కేసులోనూ 420 సెక్షన్ ఉంది. అలా రికార్డుల్లో ఉన్న వ్యక్తే.. ఇతరుల్ని 420 అంటే.. ఊరుకుంటారా..? సోషల్ మీడియా అంతా.. విజయసాయిరెడ్డి 420 కేసుల చరిత్రను తవ్వి పెట్టారు. దాంతో ఆయన కూడా హైలెట్ అయ్యారు. అయితే ఇలా హైలెట్ అవడం ఆయనకు గౌరవంగా ఉంటుందేమో కానీ.. ఏపీ రాజకీయాల్లో ఏ మాత్రం డీసెన్సీ లేని ఒకే ఒక్క నేతగా పేరు మాత్రం సుస్థిరం చేసుకున్నారని సోషల్ మీడియాలో బిరుదు ఇచ్చేశారు.