విజయ సాయి రెడ్డి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ రోజూ అవతల పార్టీల మీద ఏదో ఒక రకమైన విమర్శ చేస్తూ ఉండే సంగతి తెలిసిందే. కొన్నిసార్లు గురువింద గింజ సామెత ని గుర్తు చేస్తూ ఇతర పార్టీల నాయకుల మీద అవినీతి ఆరోపణలు, ఇతరత్రా ఆరోపణలు చేసి నెటిజన్ల చేత చీవాట్లు పెట్టించుకోవడం ఆయనకు సాధారణ విషయంగా మారింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో కొత్తగా వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే, విజయసాయి ట్వీట్లకు కు నాగబాబు కౌంటర్లు ఇస్తూ, ఈ సోషల్ మీడియా యుద్ధాన్ని రక్తి కట్టించడం.
ఇటీవల బిజెపి జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ పొత్తు పై నేరుగా విమర్శించాలంటే బిజెపి ని కూడా విమర్శించాల్సిన వస్తుంది కాబట్టి , అలా విమర్శించే సాహసం చేయలేక పరోక్షంగా బిజెపి జనసేన ల పొత్తు మీద ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. ఆయన ట్వీట్ చేస్తూ, “గుండు సున్నా దేనితోనైనా కలిసినా, విడిపోయినా ఫలితం జీరోనే. సున్నాను తలపైన ఎత్తుకున్నా, చంకలో పెట్టుకున్నా జరిగేదదే. ఇది పదేపదే నిరూపితమవుతూనే ఉంటుంది. అయినా ప్రయోగాలకు సాహసించే వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. దెబ్బతింటుంటారు. మనం పాపం అనుకుంటూ వదిలేయాలి”. బహుశా బిజెపికి సున్నా సీట్లు వచ్చాయి అన్న సంగతిని నేరుగా ప్రస్తావించడానికి ఆయన కి ధైర్యం చాలినట్లు లేదు.
అయితే విజయసాయిరెడ్డి ట్వీట్ పై కౌంటర్ వేశారు నాగబాబు. నాగబాబు ట్వీట్ చేస్తూ ” జీరో విలువ తెలియని వెధవలకి మనం ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖమ్ వూదినట్లే. ఈ రోజు సైన్స్ అండ్ మాథ్స్ అండ్ కంప్యూటర్స్ ఇంత డెవెలప్ అయ్యాయి అంటే సున్నా మహత్యమేరా చదువుకున్న జ్ఞానం లేని సన్నాసుల్లారా. మంది సొమ్ము మెక్కిన ఎటూ కానీ వెధవ కూడా నీతులు మాట్లాడడమే ..ఖర్మ రా దేవుడా..” అని రాసుకొచ్చారు.
మొత్తానికి విజయసాయిరెడ్డి, నాగబాబు ల ట్వీట్ల యుద్ధం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.