వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి… ఇప్పుడు రాజకీయాల్లో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. కానీ.. కొంత కాలం కిందటి వరకు ఆయన ఓ ఆడిటర్ మాత్రమే. వైఎస్ కుటుంబం.. ముఖ్యంగా జగన్ ఆర్థిక వ్యవహారాలను ఆయనే చూసుకునేవారు. సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న తర్వాత ఏ-1గా జగన్, ఏ -2గా విజయసాయిరెడ్డి పాపులర్ అయిపోయారు. వైసీపీలోనూ ఇప్పుడు అదే పొజిషన్ను మెయిన్టెయిన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రచయిత అవతారం కూడా ఎత్తారు. ఫిక్షన్, రాజకీయం కాకుండా.. భక్తి రచన చేశారు. అదీ కూడా..శ్రీవారి మీద. “గ్లోరీ ఆఫ్ వెంకటేశ్వర” అనే పుస్తకాన్ని తెలుగులో రాశారు. హిందీ, ఇంగ్లిష్లో కూడా విడుదల చేయాలని కొద్ది రోజుల కిందట నిర్ణయించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పుస్తకాన్ని ఆవిష్కరింపచేస్తామని.. ఆయన సమయం కోసం ప్రయత్నిస్తున్నానని జాతీయ మీడియాకు చెప్పుకొచ్చారు.
ఇప్పుడీ పుస్తకాల ప్రతులు తీసుకుని మఠాల సందర్శనకు వెళ్తున్నారు. స్వామీజీలకు బహుకరించి ఆశీర్వాదాలు తీసుకుని వస్తున్నారు. ఇంత వరకూ బాగున్నా.. ఇప్పుడీ పుస్తకాన్ని గుజరాతీలోకీ అనువదిస్తున్నారు. సాధారణంగా శ్రీవారిపై పుస్తకాలు ఎవరైనా రాస్తే.. మాతృభాషలో రాసుకుంటారు. శ్రీవారిపై తమ భక్తిని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుంటే… ముందుగా తమిళంలోకి.. ఆ తర్వాత కన్నడలోకి అనువదిస్తారు. ఎందుకంటే.. శ్రీవారి భక్తగణం అక్కడ ఎక్కువగా ఉంటుంది. కానీ విజయసాయిరెడ్డి.. తమిళం, కన్నడం వదిలేసి.. గుజరాతీలోకి పుస్తకాన్ని అనవదించి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి గుజరాతీనే ఎందుకనే అనుమానం వస్తే… సమాధానం ప్రధాని నరేంద్రమోదీ దగ్గర ఆగాల్సిందే. ఎందుకంటే..ఆయన గుజరాతీ మరి. ఆయనను ప్రసన్నం చేసుకోవాడానికి విజయసాయి గుజరాతీ అనువాదం వరకూ వెళ్లారు.
నరేంద్రమోడీపై అమితమైన భక్తిని చాటడంలో ఇటీవలి కాలంలో… విజయసాయిరెడ్డి చాలా దూకుడుగా ఉంటున్నారు. అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తూ రాజ్యసభలోనే… మోదీ కాళ్లు మొక్కిన ఘటన సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా ఆయన ఎప్పుడూ విభజన హామీల విషయంలో.. నరేంద్రమోదీని ఒక్క డిమాండ్ కూడా చేయలేదు. పైగా…విభజన హామీలు నెరవేర్చలేదని.. అసెంబ్లీలో చంద్రబాబు విమర్శిస్తే…. బీజేపీ నేతల కన్నా అమితమైన భక్తి చూపిస్తూ… ఏపీ సీఎంపై రాజ్యసభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసుల్ని.. మోదీ తరపున ఇచ్చారు కూడా. అంటే మోదీ ప్రతిష్ట కోసం… ఓ వీరభక్తుడిలా పోరాడుతున్నారన్నమాట.
కానీ శ్రీవారిపై విజయసాయికి ఇంత భక్తి ఉందా అంటే అనుమానమే. శ్రీవారి నగలు తరలిపోయాయని.. చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని.. తవ్వకాలు జరపాలని.. విజయసాయిరెడ్డి కొద్ది రోజుల కిందట డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా.. వాస్తవాలు తెలిసి కూడా.. అసత్యాలు ప్రచారం చేసి… శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీశారని.. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి.. విజయసాయిరెడ్డిపై మండిపడింది. వందకోట్లకు పరువు నష్టం కేసులు దాఖలు చేయడానికి ప్రక్రియ ప్రారంచింది. రాజకీయాల కోసం.. శ్రీవారి ప్రతిష్టను దిగజార్చేందుకు విజయసాయిరెడ్డి ఏమాత్రం వెనుకాడలేదని టీటీడీ ప్రధాన అభియోగం. దీన్ని బట్టి చూస్తే.. విజయసాయిరెడ్డికి… శ్రీవారిపై కంటే మోడీపైనే భక్తి ఎక్కువ. మరి పుస్తకంలో ఏం రాశారో మరి..!