వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అయింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ కు సమీపంలో నిర్మించిన ప్రహరీ గోడ కూల్చివేతపై స్టేటస్ కో ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
భీమిలి బీచ్ సమీపంలోని అక్రమ కట్టడాలపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వులపై తాము తాజాగా ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదని సింగిల్ జడ్జి స్పష్టం చేశారు. ఈ పిటిషన్ పై సీజే వద్ద ఉన్న పిల్ లో ప్రతివాదిగా చేరవచ్చునని నేహారెడ్డికి సూచించారు. ఇక, ఆమె దాఖలు చేసిన పిటిషన్ లో విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ను ప్రతివాదిగా చేరేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ విచారణను వారం రోజులకు వాయిదా వేశారు.
Also Read : డీఎన్ఏ గురించి అడిగితే.. ఎన్డీఏపై పడ్డ విజయసాయి!
భీమిలి బీచ్ సమీపంలో నిబంధనలకు విరుద్దంగా శాశ్వత నిర్మాణం చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ మూర్తి యాదవ్ గతంలో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తక్షణం పనులను నిలిపివేయాలని ఆదేశించింది. నిబంధనలను అతిక్రమిస్తూ నిర్మాణాలు చేపట్టడంపై చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అక్కడి ప్రహరీగోడ కూల్చివేతకు అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో.. నేహారెడ్డి హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద ఇటీవల పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ఈ వ్యాజ్యంతో సీజే వద్ద ముడిపడి ఉన్న పిల్ తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించగా.. సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరగనుంది.