ఒకప్పుడు ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనకి ఈజీ యాక్సెస్ లభించేది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆయన అంతే స్థాయిలో ఈజీగా వెళ్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు, అక్కడి నుంచి ఆదేశాలు కూడా వస్తుంటాయి. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి గురించే చెప్తున్నది. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా జరగాలంటే ఎన్నికల సంఘం వెంటనే చర్యలకు దిగాలనీ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీజీపీ ఠాకూర్ ని బదిలీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అంతేకాదు, వైకాపాను వేధిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు మాధవరావు, యోగానంద్ లను ఓఎస్డీలుగా తొలగించాలని కోరారు. డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ను కూడా వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరారు.
గతంలో వైసీపీ ఫిర్యాదు నేపథ్యంలో ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన బదిలీ అయినా కూడా… తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విజయసాయి అంటున్నారు. ఆయన్ని ఏం చెయ్యాలో కూడా ఈయనే సలహా ఇచ్చారండోయ్. ఏబీ వెంకటేశ్వరరావును సెక్రటేరియట్ కు రిపోర్ట్ చేసే విధంగా ఆదేశించాలని విజయసాయి రెడ్డి కోరడం జరిగింది. ఇంకా ఏం కోరారంటే… ఎన్నికల సంఘం ప్రధానాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ పెట్టాలనీ, ప్రతీ జిల్లాలోనూ ఇదే విధమైన కాల్ సెంటర్లు ఉండాలన్నారు. పోలింగ్ కి రెండు రోజుల ముందు నుంచీ, పోలింగ్ జరిగే రోజు కూడా పోలీస్ వ్యవస్థను పర్యవేక్షించేందుకు ఏకంగా డీజీపీ ఆఫీస్ లోనే ఎన్నికల పరిశీలకుల్ని నియమించాలని కోరారు. ఇంకా నయం… ఏకంగా పోలీసుల్నే ఎన్నికల విధుల నుంచి తప్పించి, ఎన్నికల సంఘమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని చెప్పలేదు, సంతోషం.
విజయసాయి రెడ్డి చేసింది ఫిర్యాదులా అనిపించడం లేదు. ఏపీ పోలీస్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చెయ్యాలో ఎన్నికల సంఘానికి సున్నితంగా ఆదేశించినట్టుగా ఉంది. అధికార పార్టీకి అనుకూలంగా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారూ, వారిని బదిలీ చేయండని కోరడం వరకూ ఓకే. అంతేగానీ, ఈ ఫిర్యాదు తీసుకున్న ఎన్నికల సంఘం ఏం చెయ్యాలో కూడా వీరే చెప్పేస్తుంటే… అక్కడ ఆయనకి ఎంత చొరవ ఉన్నట్టు..? ఏబీ వెంకటేశ్వర్రావును బదిలీ చేసినా కూడా.. ఇంకా ఆయనపై ఫిర్యాదు చేసి, సెక్రటేరియట్ కి రిపోర్ట్ చేయాలని సూచించడం మరీ విడ్డూరం. ఏమో… ఈ తాజా ఫిర్యాదుపై ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి. ఉన్నతాధికారులకు కారణాలు చెప్పకుండా బదిలీ చేస్తున్న వైనాన్ని చూశాం. ఈ లెక్కన వైకాపాకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వారు ఎవరో ప్రజలకు అర్థమౌతూ ఉంటుంది కదా.