వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా లో చురుగ్గా ఉండే సంగతి తెలిసిందే. ఆయన చేసే విమర్శలు చాలా మటుకు చవకబారు గా ఉంటూ, కొన్నిసార్లు భాష కూడా అసభ్యం గా ఉండడం జరుగుతుంది. అయినప్పటికీ ఆయన చేసే ట్వీట్ లకు ఆ పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో కొన్ని సార్లు జేజేలు పలుకుతూ ఉంటారు. అయితే ఇటీవల ఆయన చేస్తున్న ట్వీట్ లకు నెటిజన్ల నుండి ఏకగ్రీవంగా చీత్కారాలు ఎదురవుతున్నాయి.
ఇటీవల ఇసుక కొరత వల్ల పనులు లేక కొంత మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం, దాంతో టిడిపి జనసేన లాంటి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతోంది. అయితే ప్రాణాలు పోవడాన్ని చిన్న సమస్య అని ప్రస్తావిస్తూ, ఆ సమస్యలపై నిలదీస్తున్న విపక్షాలను రాబందులు అని అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ, “గుంట నక్కులు, రాబందులు శవాల వేటకు బయల్దేరాయి. ఎక్కడ ఒక ప్రాణం పోయినా పండుగే వాటికి. చిన్న సమస్యలను పెద్దవి చేసి చూపడం. ఇబ్బందుల్లో ఉన్న వారిని మరింత రెచ్చగొట్టడమే రాబందులకు తెలిసిన విద్య. పీక్కు తినడమే వచ్చు. ప్రాణం పోయడం ఎలాగూ తెలియదు.” అని వ్రాసుకొచ్చారు.
అయితే విజయసాయిరెడ్డి రాసిన ఈ ట్వీట్ కి నెటిజన్ల నుండి తీవ్ర స్థాయిలో చీత్కారాలు ఎదురవుతున్నాయి. అసలు మీ పార్టీ పుట్టిందే ఓదార్పు యాత్ర మీద, దానర్థం మీ పార్టీ అధినాయకుడు రాబందు అనా? అని ఒకరు ప్రశ్నిస్తే, ఓదార్పు యాత్ర సమయంలో ఎక్కడ ఎవరు చనిపోయినా మీ అధినేత అనుయాయులు పండగ చేసుకున్నారని, వారిని పరామర్శించే పేరిట మీ రాజకీయ భవిత కి పునాదులు వేసుకున్నారని మరికొందరు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా పేదలు ప్రాణాలు తీసుకుంటే దానిని చిన్న సమస్యగా ప్రస్తావించిన ఈయన ఎంపీ గా ఉండడానికి అనర్హుడు అని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మరి ఈ ట్వీట్్ కి వచ్చిన విమర్శల తర్వాత అయినా విజయసాయి రెడ్డి తన భాష మార్చుకుంటాడా అనేదిిి వేచి చూడాలి.
గుంట నక్కులు, రాబందులు శవాల వేటకు బయల్దేరాయి. ఎక్కడ ఒక ప్రాణం పోయినా పండుగే వాటికి. చిన్న సమస్యలను పెద్దవి చేసి చూపడం. ఇబ్బందుల్లో ఉన్న వారిని మరింత రెచ్చగొట్టడమే రాబందులకు తెలిసిన విద్య. పీక్కు తినడమే వచ్చు. ప్రాణం పోయడం ఎలాగూ తెలియదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 29, 2019