జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఆ లేఖపై తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి .. కేంద్ర హోంశాఖతో పాటు ఆర్థిక శాఖకు సమాచారం ఇచ్చారు. ఆ విషయాన్ని ఎంపీ రఘురామకృష్ణరాజుకు కూడా తెలిపారు. గత నెల 27వ తేదీన జగన్, విజయసాయిల అక్రమ ఆర్థిక వ్యవహారాలు, సూట్ కేసు కంపెనీల గురించి మొత్తం వివరాలతో రాష్ట్రపతికి లేఖ రాశానని..వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు ప్రకటించారు. ఏ2 విజయసాయిరెడ్డి సహకారంతోనే ఈ అవకతవకలు జరిగాయి. ఏ2 స్థాపించిన కొన్ని సూట్ కేసు కంపెనీలతో ఏ1 ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో రాష్ట్రపతికి లేఖలో సవివరంగా తెలియజేశాననని ప్రకటించారు. ఆ లేఖలపై ఇప్పుడు రాష్ట్రపతి స్పందించారు.
రఘురామకృష్ణరాజును టార్గెట్ చేసుకుని విజయసాయిరెడ్డి ఢిల్లీలో అందరికీ లేఖలు రాయడం.. ఫిర్యాదులు చేయడం వంటివి చేస్తున్నారు. ఇలా రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ -భారత్ కంపెనీలపై విజయసాయిరెడ్డి రాష్ట్రపతికి ఫిర్యాదుచేశారు. ఆ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించారు. వెంటనే విజయసాయిరెడ్డి తాను చెప్పదల్చుకుంటే అంతకు మించి ఉంటుందని… జగన్, విజయసాయి సూట్ కేసు కంపెనీల గురించి రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు దానిపై స్పందన వచ్చింది. రఘురామకృష్ణరాజు .. వైఎస్ ఉన్నప్పుడు ఆ కుటుంబానికి సన్నిహితుడు. వైఎస్ ఆత్మ గా భావించే కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సామ్రాజ్యం గుట్టు అంతా ఆయనకు తెలుసని.. ఇప్పుడు ఆయనను రెచ్చగొట్టడంతో వాటిని ప్రధాని, రాష్ట్రపతి ముందు ఉంచారని ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రపతి ఇచ్చిన సూచనల మేరకు రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖ దృష్టి కేంద్రీకరిస్తే.. మరో సంచలనం అయ్యే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున లావాదేవీలు బయటపడే అవకాశం కూడా ఉందంటున్నారు. ఏపీలో మద్యం కంపెనీల ద్వారానే పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతోందని.. ఇక ఇసుక కాంట్రాక్ట్.. ఇతర వాటి ద్వారా సేకరిస్తున్న సొమ్ము అంతా.. ఎలా వైట్‌గా చేసుకుంటున్నారో రఘురామకృష్ణరాజు తన పత్రాల్లో వివరించారని అంటున్నారు. అందుకే..రఘురామ ఫిర్యాదుపై విచారణ జరిపితే.. సంచలనాలు ఖాయమని అంటున్నారు.
అదే సమయంలో రఘురామకృష్ణరాజుపై ఫిర్యాదు చేస్తూ విజయసాయిరెడ్డి రాసిన లేఖపైనా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. ఆ లేఖ అందిందని ఎక్నాలెడ్జ్మెంట్ను పంపారు. అయితే రాష్ట్రపతి విచారణకు ఆదేశించారని.. రఘురామకృష్ణరాజుకు ఇక ఇబ్బందులేనని చెబుతూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మొత్తంగా ఈ వ్యవహారం చూస్తే విజయసాయిరెడ్డి పకడ్బందీగా ఒకరి ఆర్థిక వ్యవహారాల అవకతవకలలను మరొకరు బయట పెట్టుకునేలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.