పార్టీ ఫిరాయంపుల అంశంలో కేసీఆర్ కు సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి కౌంటరిచ్చారు. మొన్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు తెరాసలో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సభ జరిగింది. ఆ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలను విమర్శించారు. ఆ రెండూ పార్టీలూ ఫిరాయింపులను ప్రోత్సహించాయన్నారు. వాళ్లు చేస్తే సంసారం, తాము చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు.
కేసీఆర్ అంతటితో ఆగకుండా అనేక విషయాలు ప్రస్తావించారు. అదే ఫ్లోలో విజయశాంతి పార్టీ మారడంపైనా కామెంట్ చేశారు. గతంలో తెరాసకు చెందిన విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్న విషయం మర్చిపోవద్దన్నారు. దీనిపై విజయశాంతి తీవ్రంగా స్పందించారు. గట్టి కౌంటరిచ్చారు.
తాను తెరాస నుంచి ఉన్నపళంగా కాంగ్రెస్ లో చేరలేదన్నారు. ఆ పార్టీ తనను సస్పెండ్ చేసిన కొన్ని నెలల తర్వాత కాంగ్రెస్ లో చేరానని గుర్తు చేశారు. 2013 జూన్ లో తనను తెరాస నుంచి సస్పెండ్ చేశారన్నారు. ఆ తర్వాత 8 నెలలకు తాను కాంగ్రెస్ లో చేరినట్టు వివరించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారు హుందాగా మాట్లాడాలని కేసీఆర్ కు సలహా ఇచ్చారు. ఏవైనా మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని చురక అంటించారు.
మరోవైపు, తెరాస ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర జరిగిందనే కేసీఆర్ మాటకు కాంగ్రెస్ కూడా కౌంటరిచ్చింది. నిజానికి తెరాసలోనే ముసలం పుట్టిందని కాంగ్రెస్ నేతలు అన్నారు. తాను రాజకీయ వ్యభిచారినని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం ఎప్పుడూ అలాంటి పనిచేయలేదన్నారు.
మొత్తానికి తెరాస ఆపరేషన్ ఆకర్షపై కాంగ్రెస్ నేతలు ఆక్రోశంతో ఉన్నారు. తమ పార్టీని తెలంగాణలో ఖాళీ చేయడానికి జరుగుతున్న ప్రయత్నంపై మండిపడుతున్నారు. ఏం చేస్తే పార్టీ బలోపేతం అవుతుందనే దానిపై దిగ్విజయ్ సింగ్ సమక్షంలోనూ చర్చించారు. అయితే ఏదైనా ఒక పకడ్బందీ వ్యూహాన్ని ఖరారు చేశారో లేదో మాత్రం ఇంకా తెలియదు.