కాంగ్రెస్ నేత విజయశాంతి త్వరలోనే బిజెపి లోకి చేరబోతున్నారని గత కొద్దిరోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. అయితే విజయశాంతి ని కేంద్రంగా చేసుకుని ఇటీవల తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె వల్ల బీజేపీకి ఎటువంటి ప్రయోజనం ఉండదని, ఆమె ఒక కాలం చెల్లిన నేత అని ఆయన సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అయితే, తలసాని వ్యాఖ్యలపై విజయశాంతి స్పందించారు, తలసాని కి దీటుగా కౌంటర్ ఇచ్చారు.
విజయశాంతి ఒక కాలం చెల్లిన నేత అని తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై, విజయశాంతి స్పందిస్తూ, ఆ మాట కొంత వరకు నిజమే నని, నిజమైన తెలంగాణవాదులకు, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రస్తుత పరిస్థితులు కాలం చెల్లినట్లు గానే కనిపిస్తున్నాయని, తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ వ్యతిరేకులకు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిస్థితులు బాగున్నాయని వాళ్లదే ప్రస్తుత కాలం అని చురకలు అంటించారు.
గతంలో తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు తలసాని శ్రీనివాస్ పూర్తిగా సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం జరిగినన్నాళ్ళు మాత్రమే కాకుండా, 2014లో తెలంగాణ ఏర్పాటు అయ్యే నాటికి కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తలసాని శ్రీనివాస్ ఎప్పుడు మాట్లాడని విషయం కూడా తెలిసిందే. అప్పట్లో ఆయన టిడిపిలో ఉండడం వల్ల చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని వల్లెవేయడం చేసేవారు. అదీగాక తన నియోజకవర్గంలో సీమాంధ్రుల వాట ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఆయన పూర్తిగా తెలంగాణ వైఖరి ఏనాడు తీసుకోలేకపోయారు. అదే సమయంలో విజయశాంతి మాత్రం మొదటి నుండి కూడా తెలంగాణ అనుకూల వైఖరి తోనే ఉన్నారు. దీనివల్ల సీమాంధ్రలోని ప్రజల నుండి ఆమె పట్ల వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా ఆమె తెలంగాణ కి అనుకూలంగా మాట్లాడుతూ, తల్లి తెలంగాణా పార్టీని పెట్టి ఆ తర్వాత ఆ పార్టీ ని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. అయితే ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ తెలంగాణకు మంత్రి గా ఉంటే విజయశాంతి రాజకీయ భవితవ్యం ఇప్పటికీ అటు ఇటు గానే ఉంది. దీంతో తెలంగాణ ఉద్యమ ద్రోహులకు కాలం బాగుంది కానీ తెలంగాణవాదులకు , ఉద్యమకారులకు నిజంగానే కాలం చెల్లింది అంటూ ఆవిడ తలసానికి చురకలు అంటించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.