రాజకీయాల్లో విజయశాంతి మరో జంప్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన మల్లిఖార్జున్ ఖర్గేను ఆయన బస చేసిన హోటల్ లో విజయశాంతి కలిశారు. అక్కడే పార్టీలో చేరిపోయారు. ఆమె రాహుల్ సమక్షంలో పార్టీలో చేరుతారని అనుకున్నారు. కానీ అధికారికంగా పార్టీ అధ్యక్షుడి సమక్షంలో చేరాలి కాబట్టి ఖర్గే తో కండువా కప్పించుకన్నారు. తర్వాత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది. 2019లో కాంగ్రెస్ పనైపోయిందనుకుని.. ఆ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లారు. కానీ అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. అయినా అక్కడే ఉన్నారు. కానీ ఇటీవల బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని స్పష్టత రావడంతో.. పార్టీపై అసంతృప్తి ప్రకటనలు చేశారు.
దీంతో ఎవరు వచ్చినా చేర్చుకునేందుకు రెడీగా ఉన్న కాంగ్రెస్ నేతలు పాత పరిచయాలతో సంప్రదింపులు జరిపారు. ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్న విజయశాంతి పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయశాంతి మొదట బీజేపీ నుంచే తన రాజకీయ జీవితం ప్రారంభించారు. తర్వాత తల్లి తెలంగాణ అనే సొంత పార్టీ పెట్టుకున్నారు. కేసీఆర్ ఆహ్వానించడంతో బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీ తరపున మెదక్ నుంచి ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన కాంగ్రెస్ చేయడంతో 2014లో కాంగ్రెస్ లో చేరారు. ఆమెకు కాంగ్రెస్ తరపున మెదక్ అసెంబ్లీ టిక్కెట్ కేటాయించారు. కానీ అక్కడ గెలవలేదు. అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరం అయ్యారు. మళ్లీ 2019లో బీజేపీలో చేరారు. కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు.
మెదక్ ఎంపీ సీటు ఇవ్వడంతో పాటు పార్టీలోనూ ప్రాధాన్యం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో మళ్లీ ఆ పార్టీలో చేరిపోయినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున ఆమె ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. విజయశాంతి బీజేపీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ నేతలు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఆమె పార్టీ మారిపోతారని తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు.