విజయశాంతి. సినిమాల్లోనే కాదు… రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకున్నారు. సొంతంగా పార్టీ పెట్టారు. దాన్ని మూసేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కే.చంద్రశేఖర రావుతో చేతులు కలిపారు. కొన్నాళ్ల పాటు ఇద్దరి స్నేహం విరాజిల్లింది. ఆ తర్వాతే పొరపొచ్చాలు వచ్చాయి. విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది జరిగి ఆరేళ్లయ్యింది. ఈ ఆరేళ్ల కాలంలో రెండు సార్లు శాసనసభకు, రెండు సార్లు లోక్ సభకు ఎన్నికలు వచ్చాయి. స్థానిక ఎన్నికలు అయితే సరేసరి. అయితే ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని నిలువరించలేక పోయింది. ఒక విధంగా భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్ధానాలు గెలిచి తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదిగింది. తెరపై ఓ వెలుగు వెలిగిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తుందని పార్టీ అధిష్టానం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఆరేళ్లు గడిచినా విజయశాంతి వల్ల పార్టీకి వచ్చిన ప్రయోజనం మాత్రం ఏమి లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిని అడ్డుకునే సత్తా విజయశాంతికి చాలా ఉందని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశలు గడచిన ఆరేళ్లుగా ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. ఎన్నికల ప్రచారంలో విజయశాంతి గ్లామర్ పార్టీకి ఉపకరిస్తుందని గత ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను ఆమెకే అప్పగించింది పార్టీ అధిష్టానం. ఇది కూడా పెద్దగా ఫలితం చూపించలేదు. పార్టీ కోసం విజయశాంతి తెలంగాణ అంతటా తిరుగుతారని, క్షేత్రస్ధాయిలో పార్టీ పటిష్ట పరుస్తారని అధిష్టానం భావించినా అలా జరగలేదు. ఎన్నికల సమయంలో ఒకటి రెండు జిల్లాల్లో జరిగిన ప్రచార సభల్లో మాత్రమే ఆమె పాల్గొనడంతో పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయశాంతి పార్టీలోకి వచ్చిన ఈ ఆరేళ్లలోనూ పార్టీ ఎక్కడా విజయం సాధించలేదని, అలాగే ఎటువంటి శాంతి కూడా కలగలేదని పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.