తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాములమ్మ మరొకసారి ఫైర్ అయ్యారు. ఒకప్పుడు నేను తెలంగాణకు కాపలా కుక్కలా మిగిలి పోతాను అన్న కెసిఆర్ ఇవాళ తెలంగాణ ప్రజలను కుక్కలు అంటున్నాడు అంటూ కెసిఆర్ పై విమర్శలు సంధించారు. దుబ్బాక జిహెచ్ఎంసి తర్వాత మళ్లీ కెసిఆర్ కు షాక్ ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తం అవుతున్నారు అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే..
త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల కేసీఆర్ భారీగా సభ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే కొందరు ఆ సభలో ఆందోళన చేయడానికి ప్రయత్నించినప్పుడు కేసీఆర్ అసహనానికి లోనయ్యారు. తన ఉపన్యాసాన్ని ఆపివేసి మరీ, వారిని బయటకు తీసుకెళ్లాలని పోలీసులను కోరారు. కుక్కలు మొరగుతూ ఉంటాయి , పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ మాట్లాడారు. దీనిపై విపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా- ఒకప్పుడు కెసిఆర్ చెల్లి అని పిలవబడి, ఆ తర్వాత టిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరి, అక్కడ నుండి మళ్లీ బిజెపిలో చేరిన విజయశాంతి కెసిఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ” జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు జరిగిన ప్రచారసభల్లో ప్రతిపక్షాలను ఉద్దేశించి సాక్షాత్తూ సీఎం అత్యంత అసభ్యకరంగా మాట్లాడటం ప్రజలు చూశారు. ఇటీవల జరిగిన హాలియా సభలో బాధిత మహిళలను కుక్కలు అనడం చూశాము. గతంలో ఎన్నోసార్లు అనేకమంది నాయకులు, పార్టీలను, ప్రజలను అవమానకరంగా దుర్భాషలాటడం చూశాము. ఇప్పుడు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లకు భాష, ప్రవర్తన, నియమావళి గురించి అదే ముఖ్యమంత్రి గారు చెబితే వినవలసి రావడం విడ్డూరం. కనీస రాజకీయ సంస్కారం కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే ఈ సీఎం గారిని ఒక్క మాట ఎదిరించి అనరాదని టీఆరెస్ పార్టీ మంత్రులు, ముఖ్యనేతలు ఇయ్యాల అరుపులు, పెడబొబ్బలు పెడుతున్నారు. ఇది నిజాం పాలన, రాజుల కాలం కాదు… ప్రజాస్వామ్యం. ఏది ఏమైనా కరోనా రెండో డోసుకు ఆరోగ్యశాఖ సిద్ధమవుతున్నట్లే… తెరాసకు దుబ్బాక, జీహెచ్ఎంసీ తీరున మరో డోసు ఇయ్యనీకి రానున్న ఎమ్మెల్సీ, సాగర్, కార్పోరేషన్ల ఎన్నికల కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకనాడు తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటానన్న ముఖ్యమంత్రి ఇయ్యాల తెలంగాణ ప్రజలనే కుక్కలు అనబడితే… అందుకు పరిష్కారమేంటో ప్రజలకు తెల్వదా?” అంటూ రాసుకొచ్చారు.
మరి విజయశాంతి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి.