బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఆ పార్టీ సస్పెండ్ చేసి చాలా కాలం అయింది. కానీ ఇంత వరకూ ఆయన పై సస్పెన్షన్ ఎత్తి వేయలేదు. ఈ మధ్యలో టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కనీసం అప్పుడైనా ఆయనపై సస్పెన్షన్ ఎత్తి వేస్తారని అనుకున్నారు. కానీ బండి సంజయ్ సిఫారసు చేయలేదో.. కిషన్ రెడ్డికి ఇష్టం లేదో కానీ.. ఆయన మాత్రం సస్పెన్షన్ లోనే ఉన్నారు. ఎత్తివేస్తామని వెయిట్ చేయాలని ఆయనకు బీజేపీ నేతల నుంచి సందేశాలు మాత్రం వస్తున్నాయి. అయితే ఆయనకు మద్దతుగా పార్టీలో ఒక్కరే మాట్లాడుతున్నారు… ఆ ఒక్కరు విజయశాంతి.
రాజాసింగ్ సస్పెన్షన్ ను ఎత్తి వేయాలని.. ఆమె గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రాష్ట్ర బీజేపీ తరపున అన్ని సిఫార్సులు కేంద్రానికి వెళ్లాయని.. సస్పెన్షన్ ఎత్తివేయడం లేటవ్వవొచ్చు కానీ.. ఎత్తి వేయడం పక్కా అని ఓసారి భరోసా ఇచ్చారు. కానీ మాటలేమీ నిజం కాలేదు. ఇప్పుడు రాజాసింగ్ భద్రత కోసం.. ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇంటలిజెన్స్ నివేదికల ప్రకారం ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ లకు భద్రత కల్పించారని.. అలాగే రాజాసింగ్ కూ భద్రత కల్పించాలని ఆమె కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
రాజాసింగ్.. రాజకీయాన్ని… మతాన్ని కలిపేస్తారు. చాలా సార్లు బీజేపీని ఇబ్బంది పెడతారు. ఆయన చేసే రాజకీయం.. తెలంగాణకే పరిమితం కాదు.. దేశం మొత్తం ప్రభావం చూపిస్తుంది. అందుకే ఆయనను మళ్లీ బీజేపీలోకి తీసుకోవాలా వద్దా అన్నదానిపై ఆలోచిస్తున్నారు. ఎన్నికలకు ముందు సస్పెన్షన్ ఎత్తి వేసే అవకాశం ఉందని చెబుతున్నారు.