తెలంగాణ టీడీపీ మళ్లీ పుంజుకుంటుందో లేదో కానీ కొంత మంది నేతలు మాత్రం గింజుకుంటున్నారు. టీడీపీ తెలంగాణలోకి రావడం పెద్ద ప్రజాస్వామ్య ద్రోహం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వారిలో బీఆర్ఎస్ నేతలు మాత్రమే కాదు… విజయశాంతి లాంటి వారు కూడా ఉన్నారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని ఆమె… తాను ఉన్నానని ఉనికి చాటుకునేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూంటారు.
తాజాగా చంద్రబాబు టీడీపీని తెలంగాణలో బలోపేతం చేస్తామని చెప్పడంపై స్పందించారు. అదేదో తెలంగాణ సమాజంపై దాడి అన్నట్లుగా కలరింగ్ ఇస్తూ పోస్టు పెట్టారు. టీడీపీ ప్రయత్నాలు చేస్తే.. మరో తెలంగాణ ఉద్యమం వస్తుందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. విజయశాంతి వ్యవహారం చూస్తే.. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాకుండా .. రాజకీయ కారణాలతో ఉద్యమం చేశారని అనుకోక తప్పదు.
రాజకీయ స్వార్థంతో ఓ పార్టీని శత్రువుగా ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందడం కన్నా.. ప్రజలకు ఏం చేశానో చెప్పి… ఏం చేస్తామో చెప్పి ఓట్లు పొందడం ప్రజాస్వామ్యిక లక్ష్యం. విజయశాంతి ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేసి రాజకీయంగా ఫెయిలపోయి ఉన్నారు . ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ నుంచి రాజకీయం చేద్దామనుకుంటున్నారేమో కానీ.. విచిత్రమైన వాదనలతో తెరపైకి వస్తున్నారు. వీరి రాజకీయాలు ఫలిస్తాయో లేదో ?