తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయను… ప్రచారం మాత్రమే చేస్తానంటూ.. నిన్నామొన్నటిదాకా చెప్పుకొచ్చిన రాములమ్మ… విజయశాంతి.. ఇప్పుడు పోటీకి మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు బాగా మెరుగుపడ్డాయని జరుగుతున్న ప్రచారం ప్రభావమో ఏమో కానీ.. ఓ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎన్నికల కదన రంగంలోకి దూకాలని రాములమ్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్‌కు తన అభిప్రాయం చెప్పారని… ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెబుతున్నారు. తొలి జాబితాలోనే ఆమె పేరు ఉంటుందంటున్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరాదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం గెలుస్తారని బాగా నమ్మకమున్న నేతలనే ఎన్నికల్లో పోటీకి నిలబెడుతోంది.
టీఆర్ఎస్కు ధీటుగా అభ్యర్ధులను బరిలోకి దించాలని భావిస్తోంది. అయితే విజయశాంతి బలమైన అభ్యర్థి అవుతారా అన్న సందేహం.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఆమె టీఆర్ఎస్లో ఉన్నప్పుడు.. మెదక్ ఎంపీగా వ్యవహరించారు. కానీ ఆమె ప్రజలకు అందుబాటులో ఉన్నారా.. అంటే.. నూటికి 90 శాతం లేరనే చెబుతారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ.. అక్కడి ప్రజలు విజయశాంతిని పరిగణనలోకి కూడా తీసుకోలేదు. దాంతో ఆమె ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయారు. మళ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో ప్రత్యక్షమయ్యారు. ప్రచారంలో ఆమెను పట్టించుకుంటున్న వాళ్లు కూడా లేరు. అయినప్పటికీ.. ఈ సారి దుబ్బాకను ఎంచుకున్నారు. పోటీ చేస్తానని ఫీలర్స్ పంపుతున్నారు.
నిజానికి మెదక్, దుబ్బాకలను… ఈ సారి.. మహాకూటమిలో భాగంగా.. తెలంగాణ జన సమితికి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అందుకే.. మీడియా ముందు ఆ రెండు స్థానాలు టీజేఎస్‌కు ఇస్తే ఓడిపోతుందని.. కాంగ్రెస్సే పోటీ చేయాలనే వాదన వినిపించారు. ఆ రెండు స్థానాల్లో ఏదో ఓ స్థానం నుంచి పోటీ చేయాలన్న కోరికతోనే ఆమె అలా అంటున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి రాములమ్మ పోటీకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో… లేదో మరి..!