రాజకీయ నాయకులు పార్టీలు మారడం అత్యంత సర్వసాధారణ విషయం. 2018 తెలంగాణ ఎన్నికలకు ముందు ఒకావిడ ఉదయం ఒక పార్టీలో, ఉండి మధ్యాహ్నానికి మరొక పార్టీలో చేరి సాయంత్రానికి వేరొక పార్టీలో తేలారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నిన్న బిజెపిలో చేరినప్పుడు కూడా ప్రజల నుండి ఇటువంటి సెటైర్స్ వినిపించాయి. బిజెపిలో ప్రస్థానం మొదలు పెట్టి ఆ తర్వాత సొంత పార్టీ పెట్టి, దాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసి, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి ఇప్పటికే నాలుగు పార్టీలు మారినట్లు అయింది. ఇప్పుడు మళ్లీ బిజెపిలో చేరడం ఐదోసారి పార్టీ మారడం అన్నమాట. అయితే ఇలా పార్టీలు మారేటప్పుడల్లా వారు గతంలో వేరే పార్టీలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరమీదకు వచ్చి వారిని ఇబ్బంది పెట్టడం మామూలే. ఇప్పుడు విజయశాంతి విషయంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
గతంలో మోడీ టెర్రరిస్టు అన్న విజయశాంతి
గత ఎన్నికలకు ముందు ఒక సభలో మాట్లాడుతూ విజయశాంతి మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనను టెర్రరిస్ట్ తో పోల్చారు. అప్పట్లో ఆవిడ మాట్లాడుతూ, “ఇవాళ బిజెపి ని చూస్తుంటే భయమేస్తుంది. మోడీ గారు ఎప్పుడు ఏ బాంబు వేస్తారు అని ప్రజలు భయపడుతున్నారు. దడ పుడుతోంది. ఒక టెర్రరిస్టులా కనిపిస్తున్నాడు. ప్రజలను ప్రేమించవలసింది పోయి ప్రధానమంత్రి ప్రజలను భయపెడుతూ ఉన్నాడు. ఇలా చేయడం ప్రధానమంత్రి లక్షణం కాదు” అంటూ మోడీపై అప్పట్లో చెలరేగిపోయారు విజయశాంతి.
కట్ చేస్తే :
కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో మరింత దిగజారింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పట్లో నెత్తి నోరు బాదుకున్నా వినకుండా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, అటు ఆంధ్ర లో పూర్తిగా ఉనికి కోల్పోవడమే కాకుండా ఇప్పుడు తాజాగా తెలంగాణలో కూడా అంపశయ్య మీద ఉంది. దీంతో కాంగ్రెస్ లీడర్లు కూడా తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇటీవల దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికలలో గెలిచి బిజెపి తమను తాము టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిరూపించుకో గలగడంతో చాలామంది కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం బిజెపి వైపు చూస్తున్నారు. వీరందరి కంటే ముందున్న విజయశాంతి బీజేపీ నేతలతో చర్చలు జరిపి తన మార్గం సుగమం చేసుకున్నారు.
ఇప్పుడు మోడీ రక్షకుడట :
ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో బిజెపిలో చేరిన విజయశాంతి, మొన్నటికి మొన్న తాను మోడీని టెర్రరిస్టు అని తిట్టిన విషయాలను ఏ మాత్రం మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో మోడీ పై ప్రశంసల వర్షం కురిపించింది. మోడీ కారణంగానే దేశం అభివృద్ధి చెందుతోందని, అదేవిధంగా తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలని తాను భావిస్తున్నానని, మోడీ వల్లే తెలంగాణలో కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని” మోడీని ఆకాశానికి ఎత్తేసింది విజయశాంతి
“అయితే రాజకీయ నాయకులు మర్చిపోయినప్పటికీ, గూగుల్ మర్చిపోదుగా, ఇట్టా కొడితే అట్ట వచ్చేస్తది” అని మహేష్ బాబు సినిమాలో చెప్పినట్లుగా, నెటిజన్లు గూగుల్ లో లో సెర్చ్ చేసి విజయశాంతి అప్పటి వీడియోలను, అప్పటి మాటలను బయటకు తీసి ఇప్పటి మాటలతో జతచేసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.