కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ.. ఉన్నారో లేదో అన్నట్లుగా ఉన్న విజయశాంతి తనకో పదవి కావాలని నేరుగా హైకమండ్ వద్దకు వెళ్లారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలిసి.. తన సేవల్ని. త్యాగాల్ని గుర్తించారని.. ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయబోతున్న స్థానాల్లో ఒక దాన్ని తనకు కేటాయించాలని కోరినట్లుగా తెలుస్తోంది. హైకమాండ్ వద్ద రాములమ్మకు మంచి ఒపీనియన్ ఉంది. కానీ అది పదవి ఇచ్చేంత ఉందా లేదా అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.
ఇప్పటికే ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. మొత్తం నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయి. కానీ మజ్లిస్ మద్దతిస్తేనే నాలుగో స్థానంలో కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది.లేకపోతే మజ్లిస్‌కు మద్దతివ్వాలి. అలా చేస్తే మూడు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వస్తాయి. ఓ సీటు తమకివ్వాలని సీపీఐ పట్టుబడుతోంది. ఆ విషయాన్ని పక్కన పెడితే మూడు సీట్ల కోసం ముఫ్పై ఆరు మంది ప్రయత్నిస్తున్నారు. రేవంత్ అనుచరులు, సీట్లను త్యాగం చేసిన వారే ఎక్కువగా ఉన్నారు.
వారందర్నీ కాదని పార్టీలో.. పార్టీ కార్యక్రమాల్లో అసలు కనిపించని..ఎప్పుడో ఓ సారి ట్వీట్లు పెట్టే రాములమ్మకు ఎమ్మెల్సీ ఇస్తే క్యాడర్ కు ఎలాంటి సంకేతాలు వెళ్తాయని కొంత మంది మథనపడుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తిగా హైకమాండ్ చేతుల్లోనే ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే పేర్ల మేరకే నామినేషన్లు వేస్తారు. లిస్ట్ రిలీజయ్యే వరకూ రాములమ్మ విజ్ఞప్తిని హైకమాండ్ పట్టించుకుందో లేదో స్పష్టత ఉండదు.