కాంగ్రెస్ వర్గ రాజకీయాల్లో విజయశాంతి అడ్రస్ లేకుండా పోయారని అనుకున్నారు కానీ ఆమె ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు చివరి రోజు సిక్సర్ కొట్టారు. చాలా మంది నేతలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ నేరుగా హైకమాండ్ వద్దకు వెళ్లి తన పేరు లిస్టులో వచ్చేలా చేసుకున్నారు. ఆమె రాజకీయానికి మిగతా కాంగ్రెస్ నేతలు షాక్ కు గురయ్యారు. ఇప్పుడు ఆమె మంత్రి పదవిపై కన్నేశారు. తనను కేబినెట్ లోకి తీసుకునే అంశంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.
తెలంగాణలో ఆరు మంత్రి పదవులు ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్లు పదవుల కోసం ఏడాదిగా హైకమాండ్ పై ఎలాంటి ఒత్తిడి తీసుకు రావాలో అంతటి ఒత్తిడి తెస్తున్నారు. కానీ అడుగు మాత్రం ముందుకు పడటం లేదు. అసలు పదవులు భర్తీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. కానీ హైకమాండ్ ఆశీస్సులతో నేరుగా పదవి తెచ్చుకున్న విజయశాంతి .. తనకు కేబినెట్ బెర్త్ పై ఆశలు పెట్టుకున్నారు. ఇది కాంగ్రెస్ లో మాత్రమే సాధ్యమవుతుందని అనుకోవచ్చు.
విజయశాంతి ఒక్కో పార్టీలో రెండేసి సార్లు చేరారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు తిరిగారు. సొంత పార్టీ కూడా ఆమె ఖాతాలో ఉంది. అయితే ఆమెకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద ప్రత్యేకమైన పలుకుబడి ఉందని తాజా పదవుల భర్తీతో స్పష్టమైంది. ఆమె పలుకుబడిని బట్టి చూస్తే మంత్రి పదవి కూడా వచ్చినా ఆశ్చర్యం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ కాంగ్రెస్ ఓన్లీ అని నిట్టూరుస్తున్నారు.