కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఈ మధ్య వార్తల్లోనే లేరు. పార్టీ కార్యకలాపాల్లో కూడా ఏమంత యాక్టివ్ గా ఆమె కనిపించడం లేదు. కానీ, ఇప్పుడు ముందస్తు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మరోసారి యాక్టివ్ అవుతున్నానని ఆమె స్వయంగా ప్రకటించారు. ఈ నెల 15న పార్టీ జాతీయ నేతలు తెలంగాణకు వస్తున్నారు. ఆ తరువాత నుంచి తాను మళ్లీ క్రియాశీలంగా వ్యవహరిస్తానని రాములమ్మ అన్నారు. అయితే, ఈ సందర్భంగా ఆమె టీడీపీ, కాంగ్రెస్ ల పొత్తులపై కొన్ని వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా ఉన్నాయి. టీడీపీతో కాంగ్రెస్ కి పొత్తు ఆమోదయోగ్యమా కాదా అనేది ముందుగా పార్టీ అధిష్టానంతో మరోసారి చర్చించాలన్నారు!
క్షేత్రస్థాయిలో దీని మీద విశ్లేషణ జరగాలనీ, తెలంగాణ ప్రజలకు ఈ పొత్తు అవసరమా కాదా అనేదానిపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయనీ, అవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. పార్టీలో చాలామంది కార్యకర్తలు టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉందనీ, అంత సులువుగా దీనిపై నిర్ణయాలు తీసుకోకూడదని ఆమె అంటున్నారు. నిజానికి, ఇప్పటికే మహాకూటమితో కలిసి పని చేయాడానికి కాంగ్రెస్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన క్రమంలోనే ఉంది. పొత్తుకు సంబంధించిన చర్చలు కూడా జరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా దీనిపై ఏకాభిప్రాయమే వ్యక్తమైంది. మహా కూటమిలో భాగంగా టీడీపీతోపాటు ఏ ఇతర పార్టీలు వచ్చి చేరినా కలిసి పనిచేసేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమౌతోంది. అంతేకాదు, ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పన దిశగా కూటమిలోని పార్టీల మధ్య చర్చ జరుగుతోంది.
పొత్తుల విషయమై ఇంత స్పష్టంగా అంతా కనిపిస్తుంటే… ఇప్పుడు కొత్తగా దీనిపై విశ్లేషణ జరగాలీ, భిన్నాభిప్రాయాలు ఉన్నాయని విజయశాంతి అనడం అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది. పైగా, ఇన్నాళ్లూ పార్టీలో యాక్టివ్ గా లేకుండా ఉంది, ఇప్పుడు వస్తూవస్తూనే కాంగ్రెస్ పొత్తులను వ్యతిరేకించడం కొంత ఆసక్తికరంగానే మారింది. తెరాసను సమర్థంగా ఎన్నికల్లో ఎదుర్కొని నిలవాలంటే మహా కూటమి కట్టాల్సిన అవసరం రాష్ట్రంలో ఉందని హైకమాండ్ కి కూడా తెలుసు! అలాంటప్పుడు, టీడీపీతో పొత్తుపై హైకమాండ్ కూడా ఆలోచించాలనే విజయశాంతి సూచనల్ని ఎవరు వింటారు..? అయినా, మహా కూటమిలో కేవలం కాంగ్రెస్, టీడీపీలు మాత్రమే లేవు కదా! ఇతర పార్టీలూ చేరుతున్నాయి. ఇది కేవలం టీడీపీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తుగా మాత్రమే చూపించే ప్రయత్నం ఆ రెండు పార్టీలే చేయడం లేదు! మరి, ఈ చర్చను మళ్లీ లేవనెత్తడం ద్వారా రాములమ్మ ఉద్దేశం ఏంటో..? ఇలా మాట్లాడటం వల్ల తనవైపు కొంత అటెన్షన్ వస్తుందని భావిస్తున్నారో ఏమో తెలీదు!