ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఉన్నప్పటికీ రేపోమాపో బిజెపిలో చేరడానికి మార్గాన్ని ఇప్పటికే చేసుకున్న విజయశాంతి టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎంఐఎం తో కెసిఆర్ కుమ్మక్కయి, శాంతి భద్రతలను పణంగా పెట్టి, అల్లర్లను రెచ్చగొట్టి, ఆ పిదప అల్లర్లను సాకుగా చూపి కొంతమంది ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఎన్నికల నుండి తప్పించడానికి కెసిఆర్ మాస్టర్ స్కెచ్ వేశాడని సంచలన ఆరోపణలు చేశారు విజయశాంతి. వివరాల్లోకి వెళితే..
తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో విజయశాంతి , ” జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్న టీఆరెస్ అధినేత కేసీఆర్ గారు ఎంఐఎంతో కలసి కుట్రలు చేసి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను చివరిక్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎంఐఎం నేతలు మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే దానిని కట్టడి చెయ్యకపోగా ఎంఐఎం దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారని వార్తలు వస్తున్నాయి. ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చెయ్యడం లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్ గారికి అలవాటుగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవని నిర్ణయానికి రావడంతో ఏకంగా బలమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను శాంతి భద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించడానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కుట్రలకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే తెలంగాణ సమాజం సహించదు… క్షమించదు. ” అని రాసుకొచ్చారు.
అయితే ఎప్పుడు లేని విధంగా బిజెపి టిఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఈ స్థానిక ఎన్నికలని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. ఇటువంటి సమయంలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను తప్పించడం కానీ, ఎన్నికలు వాయిదా వేయడం కానీ, ఎన్నికల ప్రక్రియను మరే విధంగా ప్రభావితం చేయడం కానీ సాధ్యం కాకపోవచ్చునని, విజయశాంతి వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకీ అధికార టీఆర్ఎస్ పార్టీ విజయశాంతి వ్యాఖ్యలపై స్పందిస్తుందా లేక లైట్‌గా తీసుకుంటుందా అన్నది వేచి చూడాలి.