చిరంజీవి – విజయశాంతి సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్! వీరిద్దరూ కలసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. గ్యాంగ్ లీడర్ తరవాత వీరిద్దరి మధ్య విబేధాలొచ్చాయని, ఇద్దరూ అంటీముట్టనట్టుగా ఉంటున్నారని వార్తలొచ్చాయి.
నిజంగానే చిరు కోసం విజయశాంతి ఆ తరవాత ఎప్పుడూ గొప్పగా చెప్పింది లేదు. అయితే.. ఇప్పుడు చిరుని తెగ పొగిడేస్తోంది విజయశాంతి. వీళ్లిద్దరూ కలసి నటించిన గ్యాంగ్ లీడర్ 25 ఏళ్లు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకొంది విజయశాంతి.
డాన్సుల్లో చిరుని మించినవాళ్లు ఇప్పటికీ లేరని, టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ చిరుకి పోటీ ఇవ్వగలిగే హీరోనే లేడని చెబుతోంది విజయశాంతి. చిరులో ఓ గ్రేస్ ఉందని, అది ఇప్పటి హీరోల్లో కనిపించడం లేదని చెబుతోంది. సాటి నటీనటులను ప్రోత్సహించడంలో చిరు ముందుండేవాడట. అంతేకాదు.. తనకు కర్తవ్యం చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చిన సందర్భంలో పెద్ద పార్టీ ఇచ్చాడట. ఈ విషయాలన్నీ విజయశాంతి స్వయంగా చెప్పుకొచ్చింది. మరి గ్యాంగ్లీడర్తో వచ్చిన గొడవలు ఉత్తిదే అన్నమాట. ఆ విషయం గురించి విజయశాంతి ప్రస్తావించనేలేదు మరి.