లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకొనేంత ఇమేజ్ సంపాదించుకొన్న నటి.. విజయశాంతి. రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలపై ఫోకస్ తగ్గించారు. చాలా కాలం తరవాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో తన ఇమేజ్‌కి తగ్గ పాత్ర పోషించారు. ఆ సినిమాలో విజయశాంతి అందుకొన్న పారితోషికం గురించి అప్పట్లో ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఇప్పుడు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’ సినిమాలో కీలక పాత్ర పోషించారు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ఈ సినిమా కోసం కూడా విజయశాంతి భారీ మొత్తంలో పారితోషికం అందుకొన్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లేడీ సూపర్ స్టార్‌కు రూ.3 కోట్లు ముట్టజెప్పారన్నది ఓ టాక్. రూ.3 కోట్లంటే తక్కువ మొత్తం కాదు. ఓ స్టార్ హీరోయిన్ కు ఇస్తున్న రెమ్యునరేషన్ ఇది. విజయశాంతి రేంజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి ఇదో నిదర్శనం.
తల్లీ కొడుకుల కథ ఇది. విజయశాంతి పాత్రని చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారు. ‘కర్తవ్యం సినిమాలోని వైజయంతీకి ఓ కొడుకు ఉంటే ఎలా ఉంటుంది` అనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. దాన్ని బట్టి… విజయశాంతి పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవొచ్చు. ఇటీవలే టీజర్ విడుదలైంది. మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ కూడా సిద్ధమైంది. ట్రైలర్ కట్ చూసిన వాళ్లు ‘కల్యాణ్ కెరీర్లో మరో హిట్టు గ్యారెంటీ’ అని జోస్యం చెబుతున్నారు. అంత బాగా వచ్చిందట. సాధారణంగా సినిమా విడుదలకు వారం, పది రోజుల ముందు ట్రైలర్ విడుదల చేస్తారు. కానీ మూడు వారాల ముందే ట్రైలర్ ని వదిలేయాలని భావిస్తున్నార్ట. ఈమధ్య ఓ మాస్ పాట విడుదలైంది. దానికీ మంచి స్పందనే వస్తోంది. కాస్త ప్రచారం గట్టిగా చేసుకొంటే – మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం వుంది.