తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమర్శించడానికి ఎలాంటి అవకాశం దొరికినా… ఆయన ఒకప్పటి దేవుడిచ్చిన చెల్లి… విజయశాంతి.. వదలరు. ఎప్పటికప్పుడు.. సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టులు పెట్టి… సూటిగా విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన కేబినెట్‌ను చూపిస్తూ.. కేసీఆర్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని.. నేరుగా చెబుతున్నారు. కేబినెట్ కూర్పులో… జగన్ ను చూసి.. కేసీఆర్ చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందుంటున్నారు. ఈ విమర్శల్లో విజయశాంతి ప్రధాన ఉద్దేశం.. మహిళా మంత్రులు లేకపోవడమే..
నవ్యాంధ్రలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో.. ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. ఈ విషయాన్నే.. విజయశాంతి ఎత్తి చూపుతూ.. కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క మహిళా మంత్రికి కూడా.. చాన్స్ ఇవ్వలేదని మండిపడ్డారు. తొలి ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మహిళలకు మంత్రి పదవి లేకుండానే… ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్.. ఇప్పుడు.. రెండో సారి కూడా అలాగే కొనసాగిస్తున్నారని .. విమర్శలు గుప్పించారు. ఈ ఐదేళ్లూ ఇలాగే కొనసాగిస్తారా.. మధ్యలో అయినా ఎవరికైనా చాన్స్ ఇస్తారా అని ప్రశ్నించారు. నిజానికి తెలంగాణలో మహిళలెవరికీ మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై.. చాలా కాలం నుంచి విమర్శలు ఉన్నాయి. కానీ సామాజిక సమీకరణాలు.. సీనియార్టీ కారణంగా కేసీఆర్ మహిళలకు చోటు కల్పించాడనికి ఇబ్బంది పడుతున్నారు. అయితే.. త్వరలో జరగబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఇద్దరు మహిళలకు చోటు ఉంటుందని.. ప్రకటించారు.
అదే సమయంలో.. రాములమ్మ.. మాజీ హీరోయిన్ అయిన రోజాకు.. మద్దతుగా మాట్లాడారు. సినీ రంగం నుంచి వచ్చిన రోజాను… మంత్రి వర్గంలోకి తీసుకుని ఉండాల్సిందని.. సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానించారు. సినిమా వాళ్లను ప్రచారానికి మాత్రమే వాడుకుని … పదవుల విషయంలో పక్కన పెడుతున్నారన్నట్లుగా.. విజయశాంతి వ్యాఖ్యానించారు. మంత్రి పదవి దక్కకపోవడంపై.. రోజా అసంతృప్తికి గురయ్యారు. ఇంతవరకూ ఒక్క సారి కూడా బయటకు లేదు. విజయశాంతి లాంటి వాళ్లంతా మద్దతు పలుకుతూంటే.. ఆమె బాధ మరింత పెరిగిపోయే అవకాశం ఉంది.