గడచిన ఎన్నికల్లో ఓటమి తరువాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు విజయశాంతి. సరిగ్గా తెలంగాణ ఏర్పాటుకు కొన్నాళ్ల ముందే తెరాస విడిచిపెట్టారు. కాంగ్రెస్ లో చేరారు. ఆ తరువాత, ఆమె కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసిందీ లేదు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.. అని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. కేసీఆర్ సర్కారుపై పోరాటాల్లోగానీ, పార్టీ తరఫున జరిగే ఎలాంటి నిరసన కార్యక్రమాల్లోగానీ రాములమ్మ పాల్గొన్నదీ లేదు. దాంతో కాంగ్రెస్ నేతలు కూడా ఆమెని పెద్దగా పట్టించుకున్నదీ లేకుండా పోయింది. దీంతో ఓ దశలో ఆమె పార్టీ మారతారేమో, గులాబీ గూటికి చేరతారేమో అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే, ఉన్నట్టుండి రాములమ్మ రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటే… త్వరలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఆమెకి ప్రాధాన్యత పెంచే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికే కావాల్సినన్ని లుకలుకలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిని అధిగమించి 2019 ఎన్నికల అధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా టి. కాంగ్రెస్ ను సిద్ధం చేయాలన్నది ఏఐసీసీ లక్ష్యం. దీన్లో భాగంగా విజయశాంతికి ప్రాధాన్యత పెంచే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, విజయశాంతికి ఉన్న సినీ గ్లామర్ పార్టీకి ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఆలోచనలో పార్టీ ఉందట. ఏఐసీసీ కార్యదర్శిని చేయాలనీ, పీసీసీ ప్రచార కమిటీ బాధ్యతలు ఆమెకి అప్పగించాలనే ప్రతిపాదన తెరమీదికి వచ్చినట్టు సమాచారం. ఇప్పుడు టి. కాంగ్రెస్ వర్గాల్లో ఈ చర్చ మొదలైందని అంటున్నారు. అంతేకాదు, ఇలాంటి కథనాలు తెరపైకి రావడంతో కొంతమంది కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారట!
పార్టీతో సంబంధం లేదన్నట్టుగా ఉంటున్న విజయశాంతిని బతిమాలి మరీ తీసుకుని రావడం, ఉన్న నేతల్ని కాదని ఆమెకి ప్రాధాన్యత పెంచడం ఇప్పుడు అవసరమా అని కొందరు పెద్దలు ఆఫ్ ద రికార్డ్ వాపోతున్నట్టు తెలుస్తోంది. గడచిన మూడేళ్లలో పార్టీ కోసం ఆమె ఏం చేశారనీ, తెరాసపై తాము పోరాటం సాగిస్తున్నా కనీసం ఆమె నైతిక మద్దతు ఇచ్చిన సందర్భం ఒక్కటీ లేదనీ పార్టీ వర్గాల్లో కొందరు తీవ్రంగా ఆవేదన చెందుతున్నట్టు చెబుతున్నారు. ఏదేమైనా, ఉన్నట్టుండి రాములమ్మకు పార్టీలో ప్రాధాన్యం పెంచేస్తే, అది మరో సమస్యగా తయారై కూర్చోవడం తథ్యం. ఎందుకంటే, ఇప్పటికే పార్టీలో చాలా సమస్యలున్నాయి. నేతల మధ్య విభేదాలు రోడ్డెక్కి ఉన్నాయి. వాటిని పరిష్కరించడంపై ముందుగా హైకమాండ్ దృష్టి సారించాలి. అంతేగానీ, ఎవరో కొంతమంది నేతల ఇచ్చిన సలహాలూ సూచనలూ వినేసి, రాములమ్మ అవసరాన్ని గుర్తించినట్టుగా పెద్ద పీట వేస్తే చాలామంది నేతల మనోభావాలు దెబ్బతింటాయనడంలో సందేహం లేదు.