విజయవాడలో చెన్నుపాటి గాంధీ అనే టీడీపీ నేతపై వైసీపీ నేతలు దాడి చేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో సీపీ క్రాంతి రాణా టాటా ప్రెస్ మీట్ పెట్టి… అది క్షణికావేశం అని కవర్ చేశారు. ఆయన తీరుపై విమర్శలు ఉండగానే… ప్రత్యేక బృందాలను పెట్టి మరీ అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చిన నిందితులకు స్టేషన్ బెయిల్ వచ్చేలా చేశారు. అసలు రిమాండ్ రిపోర్ట్ లో ఏమీ లేకుండా వారు అసలు నేరం చేశారో లేదో తెలియదన్నట్లుగా కోర్టు ముదు నసగడంతో .. రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. దీని కోసమే అన్నట్లుగా నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు పోలీసులు.
ఓ సోషల్ మీడియా పోస్టు పెడితే… సీఎం అభిమానుల్ని రెచ్చగొట్టేందుకు కుట్ర చేశారని… శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని ఊహించేసుకుని ఏకంగా రాజద్రోహం లాంటి కేసులు పెట్టే పోలీసులు… పట్టపగలు ఓ వ్యక్తిపై దాడి చేసి.. రెక్కీ నిర్వహించి మరీ దాడి చేసినట్లుగా సీసీ టీవీ ఫుటేజీ ఉన్నా… ఆ నిందితులు ఏ తప్పూ చేయలేదన్నట్లుగా న్యాయమూర్తి ముందు వ్యవహరించడం ఎవరికైనా… పోలీసులపై కోపం.. అసహ్యం లాంటివి కాకుండా జాలి కలిగేలా చేస్తుంది. ఈ వ్యవస్థ ఇంత దారుణంగా పతనమైనప్పుడు ఇక సమాజంలో శాంతిభద్రతలు ఎలా ఉంటాయోనని ఆందోళన కలుగుతుంది.
వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులతో సమాజంలో అలజడి రేపడానికి ఓ ప్రణాళిక ప్రకారం ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పం అయినా.. విజయవాడ అయినా పలాస అయినా వారి తీరుఅదే. ఆయా చోట్ల అరాచకాలకు పాల్పడుతున్న వారికి పోలీసులు అండగా ఉంటున్నారు. నేరస్తులను అణచివేయాల్సిన పోలీసులు వారికే అండగా ఉండి.. చట్టాలను అనుకూలంగా మల్చి సమాజంపైకి వదిలేస్తున్నారు. ఈ పరిస్థితి విపరిణామాలు ఏపీలో ఎలాంటి పరిస్థితిని తెస్తాయో ?