బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ తరపున మేయర్ అభ్యర్థులెవరో పెద్దగా ప్రచారంలోకి రావడం లేదు కానీ.. టీడీపీ తరపున మాత్రం ఇప్పటికే ముగ్గురు నలుగురు తామంటే తామని రంగంలోకి వచ్చేస్తున్నారు. ఓసీ మహిళకు రిజర్వ్ కావడంతో… బలమైన వర్గం నుంచి.. మహిళలు పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణాజిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గా గద్దె అనురాధ ఎన్నికయ్యారు. ఆమె.. ప్రస్తుతం విజయవాడ నగర పాలక సంస్థలో ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. కార్పొరేటర్‌గా పోటీ చేసే ఉద్దేశంతోనే అలా చేసుకున్నారని చెబుతున్నారు. అనురాధ భర్త గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన నియోజవర్గంలో ఏదో ఓ వార్డు నుంచి అనూరాధ పోటీ చేసే అవకాశం ఉంది.
ఆమెను ఓసీ మహిళ కేటగిరిలో మేయర్ అభ్యర్థిత్వానికి పరిగణనలోకి తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే దేవినేని కుటుంబం నుంచి కూడా పోటీ ఉంది. దేవినేని అపర్ణ పేరును కూడా పరిశీలిస్తున్నారు. అలాగే బొండా ఉమ కూడా.. తన భార్యను కార్పొరేటర్‌గా నిలబెట్టి గెలిపించుకోవాలనుకుంటున్నారు. మేయర్ పీఠాన్ని కూడా ఆశిస్తున్నారు. తాజాగా.. ఎంపీ కేశినేని నాని.. తన కుమార్తె శ్వేతను.. ఎన్నికల బరిలోకి దించాలని నిర్ణయించుకున్నారు. రాజకీయంగా.. శ్వేత చురుగ్గా ఉంటారు. గత ఎన్నికల్లో తండ్రి తరపున ప్రచార కార్యక్రమాలను కూడా పర్యవేక్షించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో టాటా ట్రస్ట్ తరపున కార్యక్రమాలు చేపట్టడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు.
శ్వేతను కార్పొరేటర్‌గా నిలబెట్టి… మేయర్‌ను చేయాలని.. కేశినేని నాని భావిస్తున్నారు. ఇలా టీడీపీ నేతలు వరుసగా… పదవులు తమకంటే తమకని..మేయర్ సీటుపై కన్నేసి పోటీకి దిగుతున్నారు. వైసీపీలో మాత్రం.. ఈ వి,యంలో పెద్దగా స్పష్టత లేదు. మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ..తమ అభ్యర్థినే మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని పట్టుబడుతున్నారు. అయితే మేయర్ పీఠంపై హామీతో పార్టీలో చేరిన అవినాష్ వర్గం తమకే మేయర్ అభ్యర్థి చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.