హైదరాబాద్: సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ వ్యవహారంపై ఉక్కుపాదం మోపుతున్న విజయవాడ నగర పోలీస్ కమిషనర్, నిజాయతీ అధికారిగా పేరున్న గౌతమ్ సవాంగ్ పదిరోజులు సెలవుమీద వెళుతున్నారు. ఈ నెల 17 నుంచి 10 రోజులపాటు గౌతమ్ సెలవు తీసుకోనున్నారు. ఈ వార్త ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఈ కేసును పక్కదారి పట్టించటానికి నిజాయతీ అధికారి అయిన గౌతమ్‌ను తప్పిస్తున్నారేమోనని అందరూ అనుమానించారు. అయితే ఈ సెలవు పదిరోజులే అని తెలియటంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. గౌతమ్ ఈ సెలవుకోసం నెల క్రితమే అప్లై చేసుకున్నారని, అది ఇప్పుడు శాంక్షన్ అయిందని చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమార్తె, అల్లుడు, కొడుకు వద్దకు వెళ్ళి క్రిస్టమస్ జరుపుకోవటంకోసం గౌతమ్ ఈ సెలవు తీసుకుంటున్నారని సమాచారం. గౌతమ్ అరుణాచల్ ప్రదేశ్‌కు చెందినవారు. మరోవైపు ఈ పదిరోజులకుగానూ గౌతమ్ స్థానంలో మరో ఐపీఎస్ అధికారి సురేంద్రబాబు డెప్యుటేషన్‌పై రానున్నారు. సురేంద్రబాబుకు కూడా మంచి నిజాయతీ అధికారిగా పేరుంది.