విజయవాడ బైపాస్ రహదారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి ఇచ్చారు. పనులను వేగంగా పూర్తి చేసి,జూన్ చివరి నాటికి వాహనాల రాకపోకలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాజ నుంచి వెంకటపాలెం,గొల్లపూడి మీదుగా చిన్న అవుటపల్లి వరకు బైపాస్‌ను అందుబాటులోకి తెస్తారు. నాలుగు గ్రిడ్ రోడ్ల వద్ద అండర్‌పాస్‌లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటారు.
రాజధాని ప్రాంతానికి అనుసంధానమయ్యే ఈ రహదారి వెంటనే అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని సీఎం భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాజధాని ప్రాంతానికి చేరుకునే ప్రధాన హైవే రెడీ అవుతుంది. నగర నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తక్కువ సమయంలో తరలించేందుకు కూడా వీలు కలుగుతుంది.
కాజ నుంచి గొల్లపూడి మీదుగా చిన్న అవుటపల్లి వరకు నిర్మిస్తున్న చెన్నై-కోల్‌కతా హైవే బైపాస్‌లో, కాజ-గొల్లపూడి ప్యాకేజీ భాగంగా 17.88 కి.మీ. పొడవు కలిగిన మార్గం రూపొందించారు. ఇది రాజధాని ప్రాంతంలోని తొమ్మిది గ్రిడ్ రోడ్లను దాటి వెళుతుంది. అయితే అండర్ పాస్‌ల నిర్మాణం చేయాల్సి ఉంది. కానీ వైసీపీ పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం బైపాస్ పనులు నిలిపివేసి అండర్‌పాస్‌ల నిర్మాణం చేపడితే దాదాపు 15 నెలలు ఆలస్యం అయ్యే అవకాశముండటంతో, ప్రథమంగా బైపాస్‌ను పూర్తిచేయడమే ఉత్తమ మార్గమని తేల్చారు.
బైపాస్ అందుబాటులోకి వస్తే కాజ్ నుంచి చిన అవుటపల్లి వరకూ స్థలాల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. బైపాస్ రోడ్ చుట్టూ నివాస, వాణిజ్య సముదాయాలు విస్తృతంగా నిర్మితమయ్యే అవకాశం ఉంది.