ఆర్టీసీ బస్సు ఎక్కండి సురక్షితంగా ప్రయాణించండి అనేది ఓ నినాదం. కానీ ఇప్పుడు ఆ బస్సులు ప్రమాదం జరగని రోజంటూ లేదు. సోమవారం విడయవాడ బస్ స్టాండ్లో జరిగిన దుర్ఘటన సీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలు చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరించక మానదు. ఆ ఘటనపై అందరూ చర్చించుకుంటూండగానే రాత్రికి అనంతపురంలో మరో బస్సు బీభత్సం సృష్టించింది. మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ బస్సులు ఇటీవలి కాలంలో ఇలా ప్రమాదాలకు గురవడం ప్రతీ రోజూ జరుగుతోంది. ప్రాణాలు పోయినప్పుడే మీడియాలో హైలెట్ అవుతోంది.
ఆర్టీసీ అంటే సురక్షితమైన ప్రయాణానికి గమ్యం అనేది ఎక్కువ మంది నమ్ముతారు. దానికి కారణాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు బస్సుల కండిషన్ పరిశీలిస్తారు. పక్కాగా ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తారు. సర్వీస్ సరిగ్గా చేస్తారు. అయితే అది గతంలో మాట. ప్రస్తుతం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అంటే ఉద్యోగుల్ని విలీనం చేశారు. ఆర్టీసీ మాత్రం కార్పొరేషన్ లాగానే ఉంది. కొంత ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది. అదే సమయంలో బస్సులపై పెట్టుబడికి ముందుకు రావడం లేదు. ఉన్న బస్సుల సర్వీసునూ సరిగ్గా చేయడంలేదు.
విజయవాడలో ప్రమాదానికి గురైన బస్సు పది లక్షల కిలోమీటర్లు తిరిగింది. సరైన సర్వీస్ లేదు. పైగా కొత్త టెక్నాలజీ బస్సు. అంతే.. ముగ్గురి ప్రాణాలు పోయాయి. అనంతపురంలో జరిగిన బస్సు ప్రమాదమూ అలాంటి బస్సు లోపం వల్లనే. ఇలాంటి వి ఎందుకు జరుగుతున్నాయి… అంటే ఖచ్చితంగా సర్వీసింగ్ లోపం.. నిర్వహణ పాపం వల్లనే. ప్రభుత్వంలో ఎప్పుడైతే ఆర్టీసీ విలీనం అయిందో అప్పటి నుంచి ఆర్టీసీకి గడ్డు కాలం ప్రారంభమయింది. ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి రావడం లేదు. వారి అలవెన్స్లు ఆగిపోయాయి. ఆర్టీసీ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. అంతకు మించి.. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రభుత్వం నడుస్తున్నట్లే… ఆర్టీసీ నడుస్తోంది.