హైదరాబాద్: విజయవాడనుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణీకులసంఖ్య గణనీయంగా తగ్గిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ తగ్గిన శాతం ప్రస్తుతం పదిగా ఉందని, రానున్న కాలంలో ఇది ఇరవై శాతానికి పెరుగుతుందనికూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాజధానిని విజయవాడకు మార్చటమని వారు చెబుతున్నారు. అయితే ప్రయాణీకులసంఖ్య తగ్గినప్పటికీ తాము సర్వీసులేమీ రద్దుచేయలేదని తెలిపారు. ఈ పోకడ ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకుని ఆగిన తర్వాత అప్పటి డిమాండ్‌నుబట్టి తాము సర్వీసులను తగ్గిస్తామని చెప్పారు.
ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీకి 10,400 బస్సులు, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి 12 వేల బస్సులు ఉన్నాయి. రాష్ట్ర విభజన గత ఏడాది జూన్ నెలలోనే జరిగినప్పటికీ, ఆర్టీసీ విభజన రెండునెలల క్రితమే జరిగింది. అయితే ఆస్తుల విభజనమాత్రం ఇంకా జరగలేదు. దీనిని షీలా భీడే కమిటీ చూస్తోంది. తెలంగాణ ఆర్టీసీ ఏపీలో రోజుకు 94,000 కిలోమీటర్లమేర సర్వీసులు నడుపుతుండగా, ఏపీ ఆర్టీసీ తెలంగాణలో 3.2 లక్షల కిలోమీటర్లమేర సర్వీసులు నడుపుతోంది. విజయవాడనుంచి హైదరాబాద్‌కు ప్రయాణీకుల సంఖ్య తగ్గే అంశాన్నికూడా ఈ కమిటీకి నివేదిస్తామని అధికారులు చెబుతున్నారు.