మగధీర సినిమాని రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది?? అదీ చిరంజీవి, రామ్‌చరణ్‌లతో. ఆలోచన బాగుంది కానీ అయ్యే పనేనా అనుకొంటున్నారా?? ఇదేదో గాలివాటంగా పుట్టిన వార్తయితే అలానే తేలిగ్గా తీసుకొనేవాళ్లమేమో. ఈ ప్రస్తావన తీసుకొచ్చింది అక్షరాలా… మగధీర రచయిత విజయేంద్రప్రసాద్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం శ్రీవల్లీ. ప్రీరిలీజ్ ఫంక్షన్ కాసేపటి క్రితం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా మగధీర 2 ప్రస్తావన వచ్చింది. ”మగధీర 2” గనుక తీయాల్సివస్తే రామ్‌చరణ్‌తో తీస్తారా?? చిరంజీవితో తీస్తారా? అనే ప్రశ్న పరుచూరి గోపాల కృష్ణ నుంచి విజయేంద్ర ప్రసాద్‌కి ఎదురైంది. దానికి సమాధానంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ”మగధీర 2 చిరంజీవి, రామ్‌చరణ్‌లని కలిపి తీస్తా” అని సభాముఖంగా మాటిచ్చేశారు. విజయేంద్రుడే అన్నాడంటే.. దానికి ఇక తిరుగులేదు కదా? బహుశా అది మగధీర 2 కాకపోవొచ్చుగానీ, ఈ మెగా ద్వయాన్ని కలపాలన్న ఆలోచన మాత్రం విజయేంద్రప్రసాద్‌కి ఉన్నట్టే లెక్క!
* చిరంజీవి కోసం రాసుకొన్న సీన్ అది
మగధీర సినిమా కే హైలెట్ అంటే ఏం చెబుతారు?? ఒకొక్కరినీ కాదు షేర్ ఖాన్.. ఒకేసారి వందమందిని పంపు అంటూ రామ్‌చరణ్ శత్రువుల్ని ఊచకోత కోసిన సన్నివేశమే గుర్తొస్తుంది కదా? నిజానికి ఈసీన్ మగధీర కథ కంటే ముందే పుట్టింది. కానీ రామ్‌చరణ్ కోసం కాదు. చిరంజీవి కోసం. ఈ ఆసక్తికరమైన విషయాన్ని ‘శ్రీవల్లీ’ ఆడియో వేడుకలో విజయేంద్రప్రసాద్ పంచుకొన్నారు. సింహాద్రి తరవాత రాజమౌళితో సినిమా చేయడానికి చిరు కబురంపాడట. ఓవారంరోజులు ఆలోచించి.. ఈ వందమంది ఎపిసోడ్ చెప్పాడట రాజమౌళి. అది చిరంజీవికి బాగా నచ్చేసిందట. అయితే… ఏమైందో ఏమో.. ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. కానీ రాజమౌళి మాత్రం ”వందమందిని చంపే ఎపిసోడ్ చిరంజీవిగారి కోసమే పుట్టింది. ఎప్పటికైనా ఆయనకే వాడదాం..” అనేవాడట. అది అలా.. అలా ‘మగధీర’కు ఫిక్సయ్యింది.