దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి, ఆయన సినిమాలకు కథా రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కులాంతర వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో చర్చనీయాంశం గా మారాయి. అయితే మరొక పక్క ఆయన కావాలనే ఇప్పుడు తన కులాంతర వివాహం గురించి బయటకి రివీల్ చేశారని చర్చ కూడా జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..
విజయేంద్ర ప్రసాద్ సమర సింహా రెడ్డి, సింహాద్రి సహా అనేక సినిమాలకు రచయితగా పనిచేశారు. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలకు కథను అందించడం తో పాటు తానే స్వయంగా దర్శకుడిగా మారి రాజన్న, శ్రీవల్లి వంటి సినిమాలను తీశారు. అయితే ఆయన దర్శకుడి గా అంతగా సక్సెస్ కాలేక పోయారు. తెలుగు సినిమా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రేక్షకులందరినీ రంజింప చేస్తున్నప్పటికీ, కొంతమంది వీరాభిమానులు మాత్రం సినిమా నటులకు, టెక్నీషియన్లకు సంబంధించి కులాల ప్రస్తావన అప్పుడప్పుడు తీసుకుని వస్తూ ఉంటారు. అయితే అభిమానులు ఇటువంటి కులాల ప్రస్తావన ఎంతగా చేసినప్పటికీ సెలబ్రిటీలు మాత్రం నేరుగా కులాల ప్రస్తావన చేసి వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం అరుదుగా జరుగుతూ ఉంటుంది.
రాజమౌళి తండ్రి కమ్మ , తల్లి కాపు అని చెప్పిన విజయేంద్ర ప్రసాద్:
అయితే విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కమ్మ కులానికి చెందిన వాడినని, తాను ప్రేమ వివాహం చేసుకున్నానని, అయితే వివాహం చేసుకొనే సమయాని కి తనకు తన భార్య కులం ఏమిటన్నది తన కి తెలియదు అని చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి అయిన కొంత కాలం తర్వాత తన భార్య చిరంజీవి వీరాభిమాని అని తెలిసిందని, అంతే కాకుండా ఆమె ఎప్పుడూ, ” మా చిరంజీవి మా చిరంజీవి ” అంటూ ఉండేదని అన్నారు. ఒకసారి తాను ఎందుకని “మా చిరంజీవి మా చిరంజీవి” అంటున్నావ్ అని ప్రశ్నించగా, ఆవిడ తాము కాపు కులానికి చెందిన వారం అని చెప్పుకొచ్చింది అని వివరించారు. ఆ రకంగా రాజమౌళి తండ్రి కమ్మ కులానికి చెందిన వారైతే తల్లి కాపు కులానికి చెందిన వారని ఆయనే స్వయంగా రివీల్ చేసినట్లయింది. అయితే తన భార్య బాహుబలి సినిమా చూడక ముందే చనిపోయిందని, దాదాపు ఆరు నెలల పాటు కోమాలో ఉండి, ఆ తర్వాత తనువు చాలించింది అని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.
అయితే రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇలా ఓపెన్ గా కులాలని రివిల్ చేస్తూ మాట్లాడడాన్ని అనేకులు అభినందిస్తున్నారు. కుల ప్రస్తావన లేకుండా ఆయన పెళ్లి చేసుకున్న విధానం ఇప్పటి తరానికి కూడా ఆదర్శనీయం అని వారంటున్నారు. కానీ మరి కొందరు మాత్రం విజయేంద్ర ప్రసాద్ వ్యూహాత్మకంగానే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చేశారని అంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపై అత్యంత భారీ అంచనాలున్నాయి. దశాబ్దాలు గా పోటీ పడుతున్న మెగా, నందమూరి హీరో లని కలిపి మల్టీ స్టారర్ తీయాలని రాజు మౌళి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దర్శక నిర్మాతలు నటీ నటులు ఎంత జాగ్రత్త పడి సినిమా తీసిన ఏదో ఒక మూల వీరాభిమానులు అయిన ప్రేక్షకుల లో కొంత అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి కులాల టాపిక్ మీదకు డైవర్ట్ కాకుండా తెలివి గా విజయేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్య లు చేశారని వీరు అంటున్నారు. అయితే పూర్తి ఇంటర్వ్యూ చూసినవారికి మాత్రం విజయేంద్రప్రసాద్ స్వచ్ఛంగా, ఎటువంటి వ్యూహాలు లేకుండా క్యాజువల్ గా ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తుంది.
ఏది ఏమైనా విజయేంద్రప్రసాద్ ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని అంశాలు – ప్రత్యేకించి ఇద్దరు హీరోల మధ్య జరిగే ఫైట్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది అని ఆయన హైలైట్ చేసిన విధానం ప్రేక్షకులు అందరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా పట్ల మరింత అంచనాలను పెంచింది.