చిరంజీవి జోరు మామూలుగా లేదు. సినిమాల మీద సినిమాలు ఓకే చేస్తున్నాడు. కొత్త వాళ్లకి అవకాశాలు ఇస్తున్నాడు. ఒకట్రెండు హిట్లు కొట్టిన వాళ్లకూ… తలుపులు తెరిచే ఉంచుతున్నాడు చిరు. తాజాగా… చిరు కోసం ఓ కొత్త కథ తయారైంది. ఈసారి విజయేంద్ర ప్రసాద్ ఈ కథని అందించారన్నది ఇన్ సైడ్ టాక్.
బాహుబలి, భజరంగీ భాయ్ జాన్… ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రాల రచయిత విజయేంద్ర ప్రసాద్ కి చిరంజీవి అంటే.. వల్లమాలిన అభిమానం. ఆయన ఎప్పటి నుంచో చిరుతో కలసి పని చేయాలనుకుంటున్నార్ట. ఇటీవల విజయేంద్ర ప్రసాద్ చిరంజీవి మధ్య భేటీ జరిగింది. ఇద్దరూ కథ గురించి చర్చించుకున్నారని తెలుస్తోంది. చిరుకి సరిపడ కథ.. విజయేంద్ర ప్రసాద్ రాశారని, అందుకోసమే ఇద్దరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. ఇటీవల.. చిరు పుట్టిన రోజు సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ కొన్ని కామెంట్లు చేశారు. “టాలీవుడ్ లో ఒకటి, రెండు, మూడు స్థానాలు చిరంజీవివే. అన్ని రికార్డులూ ఆయన పేరు మీద ఉండాలి. త్వరలో ఆయన సినిమా పాత రికార్డులన్నీ చెరిపేసే స్థాయిలో ఆడాలి. అందుకోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తా“ అన్నారు. ఈ కామెంట్లు సైతం.. చిరు కోసం ఆయన కథ సిద్ధం చేశారన్న విషయాన్ని బలపరుస్తున్నాయి.