https://www.youtube.com/watch?v=woAtSIX4EjU
రాజమౌళి విజయాల్లో తండ్రి విజయేంద్ర ప్రసాద్ పాత్ర కూడా కీలకమే. రాజమౌళి తోడు లేకపోయినా అద్భుతాలు చేయగలనని భజరంగీ భాయ్ జాన్‌తో విజయేంద్రుడు నిరూపించుకొన్నాడు. అయితే దర్శకుడిగా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు. శ్రీకృష్ణ, రాజన్న చిత్రాలే అందుకు తార్కాణాలు. ఇప్పుడు మరోసారి దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. శ్రీవల్లీ సినిమాతో! ఇదో ఏరోటిక్ సైంటిఫిక్ థ్రిల్లర్. రజత్, నేహా హింగే ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్ ఈరోజే విడుదలైంది. ఇదో సైన్స్ ఫిక్షన్ అనే విషయాన్ని టీజర్లోనే చెప్పేశాడు దర్శకుడు. మనిషిలోని భావతరంగాల్నీ,ఆలోచనల్నీ చదివేందుకు జరిపిన ఓ ప్రయోగమే ఈ చిత్ర కథ. అయితే ఇందులో శృంగార పాళ్లెక్కువగానే కనిపిస్తోంది. కథానాయికపై జరిపిన ప్రయోగం వికటించడం వల్ల.. జరిగే అనర్థాల్ని ఆసక్తి కలిగించేలా చూపించామని చిత్రబృందం చెబుతోంది. రుణానుబంధం రూపేణా అనే శ్లోకానికి ఈ సినిమాలో అర్థం చెప్పారట. దానికీ సైన్స్ ఫిక్షన్కీ లింకు ఎలా కుదిరిందో చూడాలి. టేకింగ్, సినిమా క్వాలిటీ గురించి ఇప్పుడే మాట్లాడలేం గానీ, విజయేంద్ర ప్రసాద్ సినిమా అంటే ఆ ఆసక్తి పెరగడం సహజం. దాన్ని శ్రీవల్లీ టీజర్ పెంచలేదు.. అలాగని తగ్గించనూ లేదు. దర్శకుడిగా విఫల ప్రయత్నాలు చేస్తున్న రచయిత.. శ్రీవల్లితో తన విజయపరంపరకు శ్రీకారం చుడతాడేమో చూడాలి. శ్రీచరణ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని 2017 జనవరిలో విడుదల చేస్తారు.