రచయితగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ బోల్డన్ని భారీ విజయాలు అందుకున్నారు. కాని దర్శకుడిగా మాత్రం ఆశించిన రీతిలో విజయాలు అందుకోలేదు. దర్శకుడిగా గతేడాది తీసిన ‘శ్రీవల్లీ’ హిట్ కాదని ఆయనే స్వయంగా అంగీకరించారు. నేను సరిగా దర్శకత్వం వహించలేదని ఒప్పుకున్నారు. రచయితగా విజయేంద్ర ప్రసాద్ విజయాల శాతం ఎక్కువ వున్నా… ఆయనకు దర్శకుడిగా వుండడం ఇష్టమని చెప్తున్నారు. తెలుగులో దర్శకుడిగా విజయాలు అందుకొని ఈయన హిందీలో అదృష్టం ఎలా వుందో పరీక్షించుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. త్వరలో హిందీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఆ చిత్రానికి ఆయనే కథా రచయిత. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందే చిత్రానికి ఆయన కథ రాస్తున్నారు. హిందీలో క్రిష్ తీస్తున్న ‘మణికర్ణిక’కూ ఆయనే కథా రచయిత. ఈ రెండూ పూర్తయ్యాక స్వీయ దర్శకత్వంలో సినిమా మొదలయ్యే అవకాశాలు వున్నాయి.