తమిళనాడులో ఎప్పటికైనా సరే రెండు పార్టీల రాజకీయం మాత్రమే సాగుతుందా? మూడో శక్తి ఎదిగిరావడం అంటూ.. మూస రాజకీయాలతో జనానికి విసుగెత్తిస్తున్న ఈరెండు పార్టీలను ఇంటికి పరిమితం చేసి.. రాష్ట్ర పాలన పగ్గాలు పట్టుకోగల మూడో శక్తి ఆవిర్భావం అంటూ అసాధ్యమేనా అంటే.. అవుననే అంటున్నాయి అక్కడి రాజకీయ చర్చలు. ఇప్పుడు కూడా ప్రధానంగా రెండు కూటములే తలపడుతున్నాయి. భాజపా మొక్కుబడిగా రాష్ట్రమంతా పోటీచేస్తోంది. అదే సమయంలో బలమైన మూడో కూటమి అంటూ చిన్న పార్టీలను పోగేసిన కెప్టెన్ విజయకుమార్ ప్రజాసంక్షేమ కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. ఈ మూడో కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడిన కెప్టెన్ విజయకుమార్ స్వయంగా కూటమినుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నారనే పుకార్లే దీనికి నిదర్శనం
తమిళనాడులో జయలలితతో విభేదించిన తర్వాత.. ప్రస్తుత ఎన్నికల పర్వం తెరమీదకు వచ్చే సమయానికి కెప్టెన్ విజయకాంత్.. రాష్ట్రంలోని చిన్న చిన్న పార్టీలు అన్నింటినీ పోగేశారు. ఒక మూడో కూటమిగా తయారుచేశారు. ఆ కూటమి తరఫున తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అంటూ ప్రకటించి మరీ రంగంలోకి దిగారు. తమ కూటమిని గెలిపిస్తే.. పెట్రోలు, డీజిలు ధరలను సగానికంటె ఎక్కువగా తగ్గిస్తానంటూ చాలా భారీ ఆఫర్లను ప్రకటించారు. ఇంత చేసినా జనానికి ఆయన మీద నమ్మకం కలగడం మాట అటుంచి, కనీసం ఆయన సొంత పార్టీ వారికి కూడా నమ్మకం కలుగుతున్నట్లు లేదు. ఆ నడుమ అన్నాడీఎంకే జయలలిత ప్రయోగించిన ఆకర్ష మంత్రానికి పదిమందికి పైగా ఎమ్మెల్యేలు పోయిన సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన ఎన్నికలకు సిద్ధమవుతున్న.. ఆయన పార్టీలోని నెంబర్‌టూ చంద్రకుమార్ తదితరులు పార్టీ వీడిపోతున్నారు.
పైకి ఎలా ప్రకటించినా కొందరు జ్యోతిష్యుల మాటలు కెప్టెన్‌ను భయపెడుతున్నాయిట. తమిళుల్లో ఆధ్యాత్మిక విశ్వాసాలు మెండు. తాను గెలిచినా సీఎం కాలేనేమో అనే ఉద్దేశంతో ఆయన భార్య ప్రేమలతతో అత్యంతరహస్యంగా ఓ యాగం కూడా చేయించారుట. ఇలాంటి చిల్లర ప్రయత్నాలు ఒకవైపు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలోని కొందరు తమతో డీఎండీకే ఉండడాన్ని వ్యతిరేకిస్తుండగా.. విజయకాంత్‌కు చిరాకెత్తి.. అసలు ప్రజాసంక్షేమ కూటమి పేరుతో ఉన్న ఈ మూడో జట్టు నుంచి తమ పార్టీనే బయటకు వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం ఓ పార్టీ సమావేశం కూడా పెట్టబోతున్నారట.
తమిళ రాజకీయ పరిణామాలు గమనిస్తున్న వారికి ఇప్పటికైనా అర్థం కావాలి. అక్కడ అయ్య- అమ్మల రాజ్యం తప్ప మరో అవకాశం లేదని గ్రహించాలి.