ఈ ఏడాది మే16న జరుగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం అధికార అన్నాడిఎంకె పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోడి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను ప్రసన్నం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసారు. యావత్ దేశాన్ని శాశిస్తూ, అగ్రరాజ్యాదినేతలతో నిత్యం భుజాలు రాసుకొని తిరిగే నరేంద్ర మోడీ అంతటి వ్యక్తిని కూడా అమ్మ పట్టించుకోలేదు.
ఇక తప్పనిసరి పరిస్థితులలో రాష్ట్రంలో అన్నాడిఎంకె పార్టీకి ప్రత్యామ్నాయంగా కనబడుతున్న డి.ఎం.డి.కె. పార్టీతో పొత్తులకు భాజపా సిద్దమయింది. కానీ ఆ పార్టీ అధినేత విజయ్ కాంత్ కూడా భాజపాని తిరస్కరించారు. తమతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తామని భాజపా ఆఫర్ ని కూడా అయన ఖాతరు చేయలేదు.
ఆయన స్వయంగా నిన్న ఈ విషయాన్ని దృవీకరించారు. చెన్నైలో నిన్న సాయంత్రం జరిగిన పార్టీ మహిళా మహానాడు సభలో విజయ్‌కాంత్ మాట్లాడుతూ “మనం ఏ పార్టీతో కూడా పొత్తులు పెట్టుకోవడం లేదు. ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొందాము. మనం కింగ్ కావాలి తప్ప కింగ్ మేకర్ కాదు. పొత్తుల గురించి మీడియాలో వస్తున్న వార్తలని ఎవరూ నమ్మవద్దు. ఈ ఎన్నికలలో మనం ఒంటరిగానే పోటీ చేసి మన సత్తా ఏమిటో నిరూపించుకొందాము,” అని చెప్పారు.
అమ్మని నమ్ముకొన్న భాజపాకి ఆమె జలక్ ఇచ్చింది. పోనీ విజయకాంత్ తో నయినా సరిపెట్టుకొందామనుకొంటే ఆయన కూడా భాజపా మొహం మీద కొట్టినట్లుగా దానితో మాకు పొత్తులు అవసరమే లేదని తేల్చి చెప్పారు. ఇప్పడు ఆ రాష్ట్రంలో భాజపా ఒంటరిగా మిగిలిపోయింది. ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు భాజపాకి ఈవిధంగా ఎదురుదెబ్బలు తగులుతుండటం జీర్ణించుకోవడం కష్టమే.
తమిళనాడులో చాలా దశాబ్దాలుగా ఉండి బలంగా తన ఉనికిని చాటుకొంటున్న కాంగ్రెస్ పార్టీనే ఆ రాష్ట్ర ప్రజలు పట్టించువడం లేదు ఇంక ఏ ప్రాంతీయ పార్టీతో పొత్తులు లేని భాజపాని మాత్రం ప్రజలు ఎందుకు పట్టించుకొంటారు? ఈ సమస్య నుండి భాజపా ఏవిధంగా బయటపడుతుందో చూడాలి. సుప్రీం కోర్టులో ఉన్న జయలలిత అక్రమాస్తుల కేసులో కదలిక తెచ్చి ఆమె చేత భాజపాతో పొత్తులకు ‘ఓకే’ చెప్పించుకొంటుందేమో?