తమిళనాడు రాజకీయాలలో డిఎండికె పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ విజయ్ కాంత్ ని అమెరికాలోని రిపబ్లికన్ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ తో పోల్చవచ్చును. విజయ్ కాంత్ కూడా ట్రంప్ లాగే ఎప్పుడు ఎవరి మీద విరుచుకుపడతారో, ఎవరి పట్ల అనుచితంగా మాట్లాడుతారో తెలియదు. ఒకసారి జయలలితని, కరుణానిధి పట్ల అనుచితంగా మాట్లాడుతారు మరోసారి మీడియా విలేఖరుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తుంటారు. ఆయన నోటి ముందు ఎవరయినా దిగదుడుపే. తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇవ్వాళ్ళ తన సహా నటుడు రజనీకాంత్ పై నోరు పారేసుకొన్నారు. “రాజకీయ నాయకులు భయపెడితే భయపడేందుకు నేనేమి రజనీకాంత్ లాగ పిరికివాడిని కాను. ఎవరినయినా దీటుగా ఎదుర్కొనే ధైర్యసాహసాలు నాకున్నాయి,” అని అన్నారు.
ఆ మాటలకు రజనీకాంత అభిమానులు తీవ్ర ఆగ్రహంతో రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ కాంత్ దిష్టి బొమ్మలను దగ్ధం దహనం చేసి నిరసనలు తెలపడం మొదలుపెట్టారు. రజనీకాంత్ కి సినీ అభిమానులే కాకుండా ఆయన దానధర్మాలు, మంచితనం, హుందాతనం కారణంగా తమిళనాడులో చాలా మంది ప్రజలు ఆయనను చాలా గౌరవిస్తారు. అటువంటి వ్యక్తిని అవమానపరుస్తూ విజయ్ కాంత్ అనుచితంగా మాట్లాడటం వలన వారందరిని దూరం చేసుకొన్నట్లే భావించవచ్చు. డి.ఎం.కె. పార్టీతో పొత్తులు పెట్టుకోమని కోరినందుకు ఒకేసారి పార్టీలో 10 మంది సీనియర్ నేతలను పార్టీ నుంచి బహిష్కరించి తన అహంభావం ప్రదర్శించారు. రాజకీయాలలో విమర్శలు సాధారణమే కానీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న రజనీకాంత్ వంటి గౌరవనీయుడైన వ్యక్తి గురించి చులకనగా మాట్లాడి విజయ్ కాంత్ ప్రజల దృష్టిలో తనను తానే చులకన చేసుకొన్నారు.